By: డా. ప్రసాదమూర్తి
Vijayashanthi : గత పది రోజులుగా తెలంగాణలో తమ గ్రాఫ్ పెరుగుతోందని బిజెపి తెలంగాణ అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్న కొన్ని గంటల్లోనే ఆ పార్టీ నుంచి మరో సీనియర్ నాయకురాలు విజయశాంతి నిష్క్రమించినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పటికే సీనియర్ నాయకులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి బిజెపిని వదిలి కాంగ్రెస్ లో చేరారు. విజయశాంతి (Vijayashanthi) కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలు చూస్తుంటే బిజెపి తెలంగాణలో నానాటికీ బలహీనపడుతూ క్రమంగా ఎన్నికల్లో ఆ పార్టీ ఎలాంటి ప్రభావం చూపించలేని స్థితికి దిగజారుతున్నట్టుగా కనిపిస్తోంది.
We’re Now on WhatsApp. Click to Join.
బిజెపి నాయకులు తమ పార్టీని వదిలి వెళుతున్నా, వాళ్ళు బయట నుంచి వచ్చిన వాళ్లేనని, అలా వచ్చిన వాళ్ళు తిరిగి వెళ్ళిపోయినంత మాత్రాన తమకి నష్టం లేదని, తమ పార్టీ అఖండమైనది దేశవ్యాప్త ప్రాబల్యం కలిగినది అని చెప్పుకోవచ్చు. కానీ అలా వేరే పార్టీల నుంచి వచ్చి బిజెపిలో చేరిన వారు సామాన్యులైతే కాదు. అలాగే బీజేపీ వాళ్ళను సామాన్యులుగా పరిగణించలేదు. పార్టీలో ప్రముఖమైన స్థానాలని బిజెపి ఆ నాయకులకు కట్టబెట్టింది. స్క్రీనింగ్ కమిటీ లోను, మేనిఫెస్టో కమిటీ లోను, ప్రచార కమిటీ లోను కీలక పాత్ర పోషించే రీతిగా ఆయా నాయకులకు బిజెపి పార్టీలో గొప్ప స్థానాన్ని ఇచ్చింది. అయినప్పటికీ వారు బిజెపిని వదిలి వెళ్ళిపోయారు. ఇప్పుడు విజయశాంతి (Vijayashanthi) నిష్క్రమణతో తెలంగాణలో బిజెపి పరిస్థితి పూర్తి అయోమయంలో పడినట్టుగా కనిపిస్తోంది.
ఒకప్పుడు తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి రాబోతుందని గొప్ప ప్రచారం చేసుకున్న నాయకులు, అంతే దూకుడు ప్రదర్శించిన నాయకులు, తరువాత తరువాత క్రమంగా అధికారం అనే పాటలో పల్లవినీ చరణాల్ని కూడా మార్చేసి హంగ్ అసెంబ్లీ వచ్చే అవకాశం ఉందని మరో పాట మొదలుపెట్టారు. అంటే తమ స్థాయి ఏమిటో తమ బలం ఏమిటో పార్టీ నాయకులు గుర్తించారు. హంగ్ రావడం ద్వారా రాష్ట్రంలో ఎన్నికల అనంతరం బిజెపి అత్యంత కీలకమైన కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందని బిజెపి నాయకులు ఇప్పటివరకు కలలుగన్నారు. అలా హంగ్ అసెంబ్లీలో కీలక పాత్ర పోషించాలంటే ఒక పార్టీకి తగు మోతాదులో ఎమ్మెల్యేల సంఖ్య ఉండాలి. ఇప్పటివరకు బిజెపి నాయకులు, రాజకీయ విశ్లేషకులు ఒకలా భావించారు. బిజెపి వారు అధికారంలోకి రాకపోయినా, వారు రెండో స్థానంలో ఉండకపోయినా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చడంలో చాలా కీలక పాత్ర పోషిస్తారని, కొన్ని స్థానాలయినా సాధిస్తారని ఒక అంచనా. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే బిజెపి మూడో స్థానంలో కుదురుకున్నప్పటికీ, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గణనీయమైన స్థాయిలో చీల్చగలిగే సత్తాను చాటుకుంటుందా లేదా అన్నదే ఒక మిలియన్ డాలర్ల క్వశ్చన్ గా ఇప్పుడు మారింది.
Also Read: AP : చంద్రబాబు.. నాదెండ్ల మనోహర్ లను ‘కట్టప్ప ‘ తో పోల్చిన మంత్రి గుడివాడ అమర్నాథ్
బండి సంజయ్ ను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా తొలగించిన నాటి నుంచి రాష్ట్రంలో బిజెపి పతనం ప్రారంభమైంది. ఒకప్పుడు పార్లమెంటు ఎన్నికల్లోను, తర్వాత జిహెచ్ఎంసి ఎన్నికల్లోనూ దమ్ము చూపించిన బిజెపి తెలంగాణలో ఏదో విచిత్రం చేయబోతుందనే ఆలోచన ప్రజల్లో కలగడానికి పునాదులు వేసుకుంది. ఇప్పుడు క్రమక్రమంగా ఎన్నికల్లో సీటు ఇస్తామన్నా, పెద్ద పెద్ద పదవులు ఆశ చూపించినా, నాయకులు మాకు వద్దు బాబోయ్ అని పార్టీని విడిచి, ఆ పదవులను విడిచి వెళ్ళిపోతున్నారు. దీనితో బిజెపి రెండు వారాల్లో రాష్ట్రంలో జరగబోతున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపించగలదు అనే ప్రశ్న వస్తోంది. మూడో స్థానంలో కి దిగజారినా, అక్కడ కూడా గణనీయమైన ఓట్లను సాధించే స్థితిని బిజెపి కోల్పోతోందా అనే అనుమానం కూడా వస్తుంది. అంటే బిజెపి ఎన్నికల రేసులో ఉన్నప్పటికీ, దాని ప్రభావం జీరో స్థాయికి పడిపోతే ఆ మేరకు లాభం అధికార బీఆర్ఎస్ తో ప్రధానంగా ఢీకొంటున్న కాంగ్రెస్ కి ఎక్కువగా కలుగుతుంది.
బిజెపి ఎంత వ్యూహాత్మకంగా వ్యవహరించినా, ప్రభుత్వ వ్యతిరేక ఓటును కైవసం చేసుకోవడంలో కాంగ్రెస్ ను దెబ్బ కొట్టేటంత బలంగా ఉండబోదని ఇప్పుడు అర్థమవుతుంది. జాతీయ రాజకీయాల రీత్యా బిజెపి మొదటి ప్రాముఖ్యత కాంగ్రెస్ ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే. ఆ లక్ష్యం సాధించడంలో రోజురోజుకీ బలహీనపడుతున్న బిజెపి ఎంత మేరకు సఫలం అవుతుందో ఇంకొద్ది రోజులు మాత్రమే వేచి చూడాలి. ఇకపోతే విజయశాంతి (Vijayashanthi) రాకతో ఒక శాతం లాభం చేకూరినా అది కాంగ్రెస్ పార్టీకి అదనపు బలమే అవుతుంది.
Also Read: MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత కు కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్