Seoul Special : మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తెలంగాణ సర్కారు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దాని నిర్మాణంతో హైదరాబాద్ నగరం రూపురేఖలు మారిపోతాయని కాంగ్రెస్ ప్రభుత్వం అంటోంది. దక్షిణ కొరియా రాజధాని నగరం సియోల్‌లోని చుంగేచాన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును తాజాగా తెలంగాణ మంత్రులు, ఉన్నతాధికారులు, జర్నలిస్టులతో కూడిన టీమ్ సందర్శించింది. చుంగేచాన్ నదికి మన హైదరాబాద్‌లోని మూసీ నదికి ఉన్న సారూప్యత ఏమిటి ? చుంగేచాన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ఎలా నిర్మించారు ? దాని ప్రత్యేకతలు ఏమిటి ? అనే వివరాలను మనం ఈ కథనంలో తెలుసుకుందాం..
Also Read :HMDA Layouts : నిషేధిత జాబితాలో ఆ లేఅవుట్లు.. భూ యజమానుల బెంబేలు
1960 నాటికి అచ్చం మన మూసీలాగే..
1960 నాటికి సియోల్ నగరంలోని చుంగేచాన్ నది కూడా మన మూసీలాగే(Seoul Special) కంపుకొట్టేలా వ్యర్థాలు, చెత్తాచెదారాలతో నిండిపోయి ఉండేది. పారిశ్రామిక కంపెనీల వ్యర్థాలన్నీ ఆ నదిలోకి వచ్చి చేరేవి. పరిసర ప్రాంతాల మురుగునీటిని కూడా ఈ నదిలోకి వదిలేవారు. చుంగేచాన్ నది గట్లను ఆక్రమించుకొని ప్రజలు ఇళ్లు కట్టుకొని నివసించేవారు. దీంతో ఆ నది కనుమరుగయ్యే పరిస్థితి అప్పట్లో ఏర్పడింది.
ప్రజా వ్యతిరేకత ఎదురైనా.. భరోసా కల్పించి..
లీ మ్యుంగ్ హక్ 2002 సంవత్సరంలో సియోల్ నగర మేయర్‌గా ఎన్నికయ్యారు. ఆయనకు హ్యుందాయ్ కంపెనీలో ఇంజినీరింగ్ అండ్ కన్‌స్ట్రక్షన్ విభాగంలో సీఈవోగా పనిచేసిన అనుభవం ఉంది. చుంగేచాన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును ప్రతిపాదించింది ఈయనే. అయితే ఆయన ఆనాడు తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్నారు. రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కోసం నదిపై ఉన్న పది లేన్ల ఎలివేటెడ్ ఎక్స్‌ప్రెస్ హైవేను తొలగించాలని లీ మ్యుంగ్ హక్ చేసిన ప్రపోజల్‌ను అందరూ వ్యతిరేకించారు. నది పరిసర ప్రాంతాల వ్యాపారులు, ప్రజలు చుంగేచాన్ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు వద్దని వాదించారు. 3వేల కుటుంబాల ప్రజలు నిరాశ్రయులుగా మారుతారనే ప్రచారం జరిగింది. అయినా ప్రజలకు లీ మ్యుంగ్ హక్ భరోసా కల్పించారు. ఈ ప్రాజెక్టుతో ప్రయోజనమే కలుగుతుందనే విశ్వాసాన్ని వారిలో నింపారు. ప్రజలకు భరోసా కల్పించడానికి లీ మ్యుంగ్ హక్ నాలుగు వేలసార్లు ఆ ప్రాంతంలో పర్యటించారు. 1000 మందికి తక్షణ పునరావాసం కల్పించారు.
Also Read :Arm and Wrist Pain : ఉద్యోగులు చేయి, మణికట్టు నొప్పితో ఎందుకు బాధపడుతున్నారు..?
రూ.2,300 కోట్లతో నిర్మాణం..
చుంగేచాన్ నది పరిధిలో ఉన్న మురుగునీటి వ్యవస్థను తొలగించే పనులను 2003 ఫిబ్రవరిలో ప్రారంభించారు. మొత్తంగా అంతర్థానమైన చుంగేచాన్ నదిని 2005 సెప్టెంబరులో మళ్లీ కనిపించేలా చేశారు. నదిని పునరుద్ధరించాక 1.4 లక్షల మొక్కలను ఆ ప్రాంతంలో నాటారు. నాలుగేళ్లలోనే చుంగేచాన్ నదిపై ఉన్న హైవేను తొలగించి నదీ ప్రాంతంగా, పర్యాటక కేంద్రంగా డెవలప్ చేశారు. ఈ ప్రాజెక్టు కోసం అప్పట్లో రూ.2,300 కోట్లు ఖర్చు చేశారు. చుంగేచాన్ నదిలో నీటిని నింపేందుకు హాన్‌నది నుంచి రోజుకు 90 వేల క్యూబిక్ మీటర్లు ఎత్తిపోశారు. ప్రస్తుతం సియోల్ ఆకర్షణీయ నగరంగా తయారైంది. ఇప్పుడు సియోల్ నగరం నడిబొడ్డున 10 కి.మీ. పొడవున్న చుంగేచాన్ నది పరీవాహక ప్రాంతం చుట్టూ వందల సంఖ్యలో ఆకాశహర్మ్యాలు ఉన్నాయి. ప్రతిరోజు చుంగేచాన్ నదిని దాదాపు 64వేల మంది సందర్శిస్తారు.