TSPSC: టీఎస్పీఎస్పీ లీక్ వ్యవహారంలో పూర్తి వివరాలివ్వండి : గవర్నర్ తమిళిసై

టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో ఆమె సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది.

  • Written By:
  • Updated On - March 24, 2023 / 10:52 AM IST

తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ TSPSC వ్యవహారంపై స్పందించారు. లీకేజీ వ్యవహారంలో తనకు పూర్తి వివరాలు సమర్పించాలంటూ టీఎస్‌పీఎస్సీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి, సీఎస్ శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్‌కు వేర్వేరుగా లేఖలు రాశాలు. పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఎంత మంది పని చేస్తున్నారు? అందులో ఎవరెవరు రెగ్యులర్ ఉద్యోగులు.. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే వివరాలు చెప్పాలని చైర్మన్ జనార్థన్ రెడ్డికి రాసిన లేఖలో పేర్కొన్నారు.

మరోవైపు సిట్ అధికారుల దర్యాప్తు ఎంత వరకు వచ్చింది? దర్యాప్తు స్టేటస్ చెప్పాలంటూ డీజీపీకి రాసిన లేఖలో అడిగారు. ఇతర వివరాలు ఏవైనా ఉంటే తనకు తెలియజేయాలని సీఎస్‌ను కోరారు. కాగా, టీఎస్‌పీఎస్సీ రాజ్యాంగబద్దమైన సంస్థ కావడంతో.. గవర్నర్‌కు దాని గురించి పూర్తి వివరాలు అడిగే హక్కు ఉంటుంది. ఈ నేపథ్యంలోనే లేఖలు రాసినట్లు తెలుస్తున్నది.

ఇక ఇటీవల పలువురు కాంగ్రెస్ నేతలు గవర్నర్‌ను కలిసినప్పుడు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో గవర్నర్ సమగ్ర నివేదిక కోరడంతో.. ఆ తర్వాత చర్యలు ఏమైనా తీసుకుంటారా అనే ఆసక్తి నెలకొన్నది. టీఎస్‌పీఎస్సీ వ్యవహారంలో ఆమె సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తున్నది. కాగా, ఇప్పటికే కమిషన్ అనేక సంస్కరణలు తీసుకొని రావాలని నిర్ణయం తీసుకున్నది. ఈ వివరాలను గవర్నర్‌కు తెలియజేయాలని కమిషన్ చైర్మన్ జనార్థన్ రెడ్డి భావిస్తున్నారు.