Site icon HashtagU Telugu

Old City Lac Bangles : హైదరాబాద్ పాతబస్తీ లక్క గాజులకు అరుదైన గుర్తింపు

Old City Lac Bangles

Old City Lac Bangles

Old City Lac Bangles : మన హైదరాబాద్‌‌కు మరో అరుదైన గుర్తింపు దక్కింది. హైదరాబాద్ నగరానికి చెందిన ఇంకో వస్తువుకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ)  గుర్తింపు దక్కింది. అదేమిటో తెలుసా ? పాతబస్తీ అంటే గాజులకు ఫేమస్. చార్మినార్‌‌లోని లాడ్‌బజార్‌‌లో తయారు చేసి విక్రయించే  లక్క గాజులకు జియోగ్రాఫికల్‌ ఇండికేషన్‌ (జీఐ)  ట్యాగింగ్ మంజూరైంది. తెలుగులో వీటిని లక్క రాళ్ల గాజులు అని పిలుస్తుంటారు.వీటికి  చెన్నైలోని కేంద్ర ప్రభుత్వ జీఐ రిజిస్ట్రీ శనివారం జీఐ రిజిస్ట్రేషన్‌ ట్యాగ్‌ను అనౌన్స్ చేసింది. దీంతో తెలంగాణలో జీఐ ట్యాగ్‌‌ను పొందిన 17వ ఉత్పత్తిగా లక్క  గాజులు నిలిచాయి. ఇంతకుముందు మన హైదరాబాద్‌ హలీమ్‌కు కూడా జీఐ ట్యాగ్‌ లభించింది.

We’re now on WhatsApp. Click to Join

లక్క గాజులు(Old City Lac Bangles) చాలా ఫేమస్. ఫంక్షన్లు, వేడుకల్లో వీటిని ఎక్కువగా ధరిస్తుంటారు. ఈ గాజుల తయారీ అత్యంత క్లిష్టమైన ప్రక్రియ. రెసిన్‌ను కొలిమిపై కరిగిస్తే లక్క వస్తుంది. లక్కను వృత్తాకారంలో మలిచి.. దానిపై స్ఫటికాలు, రాళ్లు, పూసలు, అద్దాలను హస్తకళాకారులు చేతులతోనే అందంగా పొదుగుతారు. కాలక్రమంలో గాజుల డిజైన్ల తయారీలో చాలా మార్పులు వచ్చాయి. మొగలుల కాలంలోనే ఈ గాజుల తయారీ కళ మొదలైందని చరిత్రకారులు చెబుతుంటారు. అప్పట్లో రాజకుటుంబాల్లోని మహిళల కోసం లక్క గాజులను తయారు చేసేవారట. లాడ్‌ బజార్‌లో మాత్రమే దొరికే లక్క గాజులకు జీఐ గుర్తింపు కోసం 2022లో క్రిసెంట్‌ హ్యాండీక్రాఫ్ట్స్‌ ఆర్టిజన్స్‌ వెల్‌ఫేర్‌ అసోసియేషన్‌ దరఖాస్తు చేసింది.  ఈ ప్రతిపాదనకు తెలంగాణ పరిశ్రమలు, వాణిజ్య శాఖ కూడా తమవంతు సహాయ సహకారాలను అందించింది. 18 నెలల పరిశీలన అనంతరం లక్క గాజులకు ఎట్టకేలకు  జీఐ ట్యాగ్‌ లభించింది. త్వరలోనే జీఐ సర్టిఫికెట్ ఇష్యూ చేయనున్నారు.

Also Read : Nuclear Weapons Cargo : పాక్‌కు భారత్ ‘అణు’ షాక్.. ఆ మెషీన్లు స్వాధీనం

లాడ్ బజార్‌.. లక్క బ్యాంగిల్స్ హబ్‌

లాడ్ బజార్‌ చాలా పురాతన మార్కెట్‌. లాడ్ బజార్‌ను లక్క బ్యాంగిల్స్ హబ్‌గా చెప్పుకుంటారు.  ఇక్కడ 350కిపైగా దుకాణాలు ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన బ్యాంగిల్స్‌ మార్కెట్ ఇదని చెప్పుకోవడంలో అతిశయోక్తి లేదేమో.  ఇంకా 150 కన్నా ఎక్కువ వర్క్‌షాప్‌లు ఉన్నాయి. ఎంతో నైపుణ్యంతో వివిధ రకాల గాజులను ఇక్కడ తయారు చేస్తారు. అల్యూమినియం, వెండి, టైటానియం, లక్క, రాళ్లు, రంగులు ఇలా వివిధ పదార్థాలతో గాజులను రూపొందిస్తారు.  పండుగ సీజన్ వచ్చిందంటే చాలు ఇక ఇక్కడ రద్దీ భారీగా పెరుగుతుంది. మార్కెట్‌లో విక్రయాలు పుంజుకుంటాయి. వివాహాలు లేదా ఇతర ప్రత్యేకమైన కార్యక్రమాలు వచ్చినప్పుడు కూడా ఈ మార్కెట్‌లో అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కస్టమ్మే డ్ బ్యాంగిల్స్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన విధంగా గాజులను తయారు చేయించుకోవచ్చు. స్థానిక కస్టమర్లు మార్కెట్‌కి తరలి రావడమే కాకుండా, ఇతర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది అదిరే బ్యాంగిల్స్‌ కోసం ఇక్కడి వస్తూ ఉంటారు.అంతేకాకుండా ఒమన్ వంటి విదేశాల్లో ప్రదర్శనలకు కూడా ఇక్కడి నుంచి బ్యాంగిల్స్ వెళ్తాయంటే.. ఇక్కడి గాజులకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.  హైదరాబాద్‌లోని ఈ బ్యాంగిల్స్‌కు అంతర్జాతీయ గుర్తింపు ఉంది. లాడ్ బజార్‌లో కేవలం గాజులు మాత్రమే కాకుండా ఇతరత్రా వాటిని కూడా కొనుగోలు చేయొచ్చు.  విలువైన రాళ్లు, ముత్యాలు, ఆభరణాలు, పెయింటింగ్‌లు, సిల్క్, కాటన్, వెల్వెట్ వంటి సాంప్రదాయ బట్టలు కూడా ఇక్కడ ఉంటాయి.