హైదరాబాద్(Hyderabad)ను మరింత పరిశుభ్రంగా మార్చేందుకు జీహెచ్ఎంసీ (GHMC) కీలక నిర్ణయాలను తీసుకుంది. పారిశుద్ధ్య నియమాలను ఉల్లంఘించేవారిపై ఇప్పటి వరకు స్వల్పంగా జరిమానాలు విధించేవారు. కానీ ఇకపై మరింత కఠినంగా అమలు చేయనున్నారు. ఈ చర్యల అమలును పారదర్శకంగా నిర్వహించేందుకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను రూపొందిస్తున్నారు. టీసీఎస్ సంస్థ దీనిని అభివృద్ధి చేస్తుండగా, వచ్చే నెలలో ఇది అందుబాటులోకి రానుంది. యాప్ ప్రారంభమైన వెంటనే అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు, తద్వారా వారు ప్రజలకు సరైన అవగాహన కల్పించగలరు. ఈ యాప్ ద్వారా ప్రతి అధికారి తన లాగిన్ వివరాలు పొందిపొందనున్నారు. పారిశుద్ధ్య ఉల్లంఘనలు గుర్తించిన వెంటనే వాటికి సంబంధించిన ఫోటోను యాప్‌లో అప్లోడ్ చేయాలి. దీంతో ఉల్లంఘన చేసిన వ్యక్తికి డిజిటల్ రసీదు జనరేట్ అవుతుంది. జరిమానా సమాచారం ఆయా వ్యక్తులకు వాట్సాప్ లేదా SMS ద్వారా పంపబడుతుంది. ఈ విధానం వల్ల పారదర్శకత పెరిగి, పారిశుద్ధ్య నియమాలను ప్రజలు మరింతగా పాటించే అవకాశముంది.
Nagababu : నాగబాబుకు మంత్రి పదవి ఖాయమేనా ?
జరిమానాల పరంగా చూస్తే.. రోడ్డుపై చెత్త వేసిన వారికి రూ.100, బహిరంగ మూత్ర విసర్జన చేస్తే రూ.100 జరిమానా విధించనున్నారు. దుకాణదారులు రోడ్డుపై చెత్త వేస్తే, గోడలపై రాతలు రాస్తే రూ.1,000 జరిమానా విధించనున్నారు. అలాగే గోడలపై పోస్టర్లు అంటిస్తే రూ.2,000, అనుమతి లేకుండా బ్యానర్లు, కటౌట్లు కడితే రూ.5,000 జరిమానా విధించనున్నారు. మరీ ముఖ్యంగా నాలాల్లో చెత్త వేస్తే రూ.10,000 జరిమానా విధించనున్నారు. ఈ నూతన చర్యలు నగర పారిశుద్ధ్యాన్ని మెరుగుపరిచేందుకు ఉపకరిస్తాయని అధికారులు అంటున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరింత కఠినమైన చర్యలు తీసుకుంటోంది. ప్లాస్టిక్ కవర్లు నిల్వ చేసేవారికి మొదటి తప్పుకు రూ.10,000 జరిమానా, రెండోసారి రూ.25,000 జరిమానా విధించనున్నారు. మూడోసారి ఇదే తప్పు చేస్తే దుకాణాన్ని మూసివేయనున్నారు. ఇక నిర్మాణ వ్యర్థాలను అనుమతి లేని వాహనాల్లో తరలిస్తే రూ.50,000 జరిమానా విధించనున్నారు. ఈ కొత్త చర్యల ద్వారా హైదరాబాద్‌ను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, ప్రజల్లో బాధ్యతను పెంచే దిశగా ప్రభుత్వం ముందుకు అడుగేస్తోంది.