GHMC Jumpings : ‘గ్రేటర్’ స్టాండింగ్ కమిటీ పోల్స్.. బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ బలం ఎంత ?

స్టాండింగ్‌ కమిటీ(GHMC Jumpings)లో ఎక్కువ మంది సభ్యులున్న రాజకీయ పార్టీ, దాని నిర్ణయాలపై ప్రభావాన్ని చూపిస్తుంటుంది.

Published By: HashtagU Telugu Desk
Ghmc Standing Committee Brs Bjp Congress Corporators Jumpings

GHMC Jumpings : తెలంగాణలో ఓ వైపు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతుండగా.. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) స్టాండింగ్ కమిటీ ఎన్నికల హడావుడి మొదలైంది. జీహెచ్‌ఎంసీ స్టాండింగ్‌ కమిటీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సోమవారం రోజు(ఫిబ్రవరి 10న) మొదలైంది. ఈనెల 17 వరకు నామినేషన్లను స్వీకరించనున్నారు. జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీలోని 15 స్థానాలకు ఫిబ్రవరి 5న  ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వారే స్టాండింగ్‌ కమిటీ సభ్యులు అవుతారు. స్టాండింగ్ కమిటీ కాలపరిమితి ఏడాది మాత్రమే.

Also Read :NTR Bharosa Pension : పింఛన్ల విషయంలో కొత్త రూల్ తీసుకొచ్చిన సీఎం చంద్రబాబు

ఎవరి బలం.. ఎంత ? 

స్టాండింగ్‌ కమిటీ(GHMC Jumpings)లో ఎక్కువ మంది సభ్యులున్న రాజకీయ పార్టీ, దాని నిర్ణయాలపై ప్రభావాన్ని చూపిస్తుంటుంది. అందుకే ఈ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం జీహెచ్‌ఎం‌సీలోని మొత్తం 146 మంది కార్పొరేటర్లలో బీఆర్‌ఎస్‌కు 42 మంది, ఎంఐఎంకు 41 మంది, బీజేపీకి 39 మంది, కాంగ్రెస్‌కు 24 మంది ఉన్నారు. కార్పొరేటర్ల బలం ఉన్నా.. మారిన రాజకీయ పరిణామాలతో ఈసారి స్టాండింగ్ కమిటీ ఎన్నికలు బీఆర్ఎస్‌కు పెద్ద సవాలుగా మారాయి. ఎందుకంటే.. బీఆర్ఎస్‌కు చెందిన మరింత మంది కార్పొరేటర్లను తమ వైపు తిప్పుకోవడంపై బీజేపీ, కాంగ్రెస్‌లు స్కెచ్ గీస్తున్నాయి. ఆ స్కెచ్ అమలైతే ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతుంది.

Also Read :Telangana Secretariat : ఊడిపడ్డ పెచ్చులు..నిర్మాణ లోపాల పై విమర్శలు

గులాబీ బాస్ ఏం తేలుస్తారు ?

ఇప్పటికే ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరమైన బీఆర్ఎస్, స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు కూడా దూరంగా ఉండిపోయే ఛాన్స్ ఉంది. ఈ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే దానిపై ఈ నెల 17లోగా ప్రకటన చేస్తామని బీఆర్ఎస్ నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు.  ఈలోగా జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లతో గులాబీ బాస్ కేసీఆర్‌ సమావేశం కానున్నారు. స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో ఏం చేయాలనే దానిపై వారికి దిశానిర్దేశం చేయనున్నారు. దీనిపై బీఆర్ఎస్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు బీజేపీ దూకుడుగా ముందుకు పోతోంది. స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో ఏ పార్టీతోనూ పొత్తు అక్కర్లేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  బీజేపీ కార్పొరేటర్లకు తేల్చి చెప్పారు. ఆసక్తి ఉన్న బీజేపీ కార్పొరేటర్లు పోటీ చేయొచ్చని ఆయన సూచించారు.

కాంగ్రెస్, ఎంఐఎం కలిసి పోటీ చేస్తాయా ?

మరోవైపు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో బలంగా ఉంది.  ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిపోయారు. దీంతో బీఆర్ఎస్ వీక్ అయిపోగా, కాంగ్రెస్ బలపడిపోయింది. స్టాండింగ్‌ కమిటీలో ఉన్న 15 స్థానాలు ఇప్పటిదాకా బీఆర్‌ఎస్‌–ఎంఐఎం పొత్తులో భాగంగా ఆ రెండు పార్టీలకే ఏకగ్రీవమవుతూ వచ్చాయి. పొత్తులో భాగంగా ఎంఐఎం కార్పొరేటర్లు  తమకు  కేటాయించే ఏడు స్థానాలకు నామినేషన్లు వేసేవారు. బీఆర్‌ఎస్‌ నుంచి దాని వాటా మేరకు ఎనిమిది మంది కార్పొరేటర్లు నామినేషన్లు వేసేవారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌–ఎంఐఎం పొత్తు లేదు. చాలామంది కార్పొరేటర్లు ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల బలం మూడు నుంచి 24కు పెరిగింది. ఈసారి ఎంఐఎం,  కాంగ్రెస్‌ అవగాహనతో కలిసి పోటీచేసే  అవకాశం ఉంది.  అయితే చివరి నిమిషంలో ఇవి రెండూ వేర్వేరుగా పోటీ చేసినా ఆశ్చర్యం లేదు.

  Last Updated: 13 Feb 2025, 08:15 AM IST