Banyans of Chevella:చేవెళ్ల మర్రి.. ఉనికిపై వర్రీ.. జియో ట్యాగింగ్ చేసిన “నేచర్ లవర్స్”!

చేవెళ్ల మర్రి చెట్లపై ఇప్పుడు వాడీవేడి చర్చ జరుగుతోంది. వాటికి రక్షణ కల్పించాలంటూ 2018 సంవత్సరం నుంచి పోరాడుతున్న "నేచర్ లవర్స్ ఆఫ్ హైదరాబాద్" స్వచ్ఛంద సంస్థ మరో అడుగు ముందుకు వేసింది.

  • Written By:
  • Publish Date - August 13, 2022 / 12:14 PM IST

చేవెళ్ల మర్రి చెట్లపై ఇప్పుడు వాడీవేడి చర్చ జరుగుతోంది. వాటికి రక్షణ కల్పించాలంటూ 2018 సంవత్సరం నుంచి పోరాడుతున్న “నేచర్ లవర్స్ ఆఫ్ హైదరాబాద్” స్వచ్ఛంద సంస్థ మరో అడుగు ముందుకు వేసింది. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్లే 46.6 కిలోమీటర్ల… 163వ జాతీయ రహదారి మార్గంలో 914 మర్రి చెట్లకు జియో ట్యాగింగ్ చేసింది. మర్రి చెట్ల ఆరోగ్యం, మర్రి కాండం కొలతలు, వేళ్ల స్థితిగతులు, మర్రి చెట్ల కాల్చివేతలు, కూల్చివేతలు వంటి వివరాలన్నీ జియో ట్యాగింగ్ సర్వేలో భాగంగా సేకరించి నమోదు చేశారు. ఈ ప్రక్రియ లో దాదాపు 20 మంది వలంటీర్లు పాల్గొన్నారు. మొత్తం 200 గంటల పాటు వలంటీర్లు రోడ్ల వెంట తిరుగుతూ సర్వే వివరాలు సేకరించారు. 914 మర్రిచెట్ల స్థితిగతులను అద్దం పట్టే ఫోటోలను కూడా జియో ట్యాగింగ్ లో భాగంగా భద్రపరిచారు.

ఎందుకీ పోరాటం?

నిజాం నవాబు హైదరాబాద్ ను ఎంతో అభివృద్ధి చేశాడు. హైదరాబాద్ నుంచి చేవెళ్ల వైపు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఇరువైపులా వందలాది మర్రి మొక్కలను నాటించాడు. ప్రయాణికులకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేందుకు ఈ చర్యలు చేపట్టాడు. అలనాటి మొక్కలే మహా వృక్షాలుగా మారి వందల ఏళ్లుగా నిలబడి ఉన్నాయి. చేవెళ్ల రహదారిపై దాదాపు 100 ఏళ్ల నాటి 48 మర్రి చెట్లు గత కొన్నేళ్లుగా ఉద్దేశపూర్వకంగా లేదా ప్రమాదవశాత్తు దెబ్బతిన్నాయి. వాటిని దహనం చేయడం వల్ల కోలుకోలేని నష్టాన్ని చవిచూశాయి. హైదరాబాద్ నగర శివారులోని అప్పా జంక్షన్‌ నుంచి 46 కి.మీ. దూరంలో ఉన్న మన్నెగూడ కూడలి వరకు 60 మీటర్ల వెడల్పుతో ఎక్స్‌ప్రెస్‌ వే అభివృద్ధి చేస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీ నేపథ్యంలో ఈ రోడ్డు విస్తరణ శుభవార్తనే. కానీ ఆ రోడ్డులో విస్తరించి ఉన్న ఊడల మర్రి వృక్షాలు కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది. కేవలం 46 కి.మీ. దూరంలో 890 మర్రిచెట్లున్నాయి. ఇవన్నీ 80 నుంచి నుంచి వంద ఏళ్ల వయసున్న వృక్షాలు. వీటిని తొలగిస్తే, నగరంతో పెనవేసుకున్న నిజాం కాలం నాటి ఊడల మర్రులన్నీ అంతరించినట్టే. వాటి ఉనికి దెబ్బతినకుండా కాపాడే పోరాటంలో “నేచర్ లవర్స్ ఆఫ్ హైదరాబాద్” సంస్థ నిమగ్నమైంది.

మర్రిచెట్ల తొలగింపు, తరలింపుపై..

రహదారి విస్తరణ కోసం తొలగించే మర్రి చెట్లను  ట్రాన్స్‌లొకేషన్‌ పద్ధతిలో మరో చోట నాటాల్సి ఉంది.ఇప్పుడు చేవెళ్ల రోడ్డు విస్తరణలో ఈ ట్రాన్స్‌లొకేషన్‌ ప్రక్రియను అమలు చేయాల్సి ఉంది. కానీ గండిపేట రోడ్డు విస్తరణ సమయంలో ట్రాన్స్‌లొకేషన్‌ను ప్రక్రియను అధికారులు అమలు చేయలేదు. భారీ వృక్షాలను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు. ఈ సంస్థ నిర్వహించిన జియో ట్యాగింగ్ ప్రక్రియకు డెవలప్‌మెంట్ ప్రొఫెషనల్ నటాషా రామరత్నం సారధ్యం వహించారు. “మేము హైవేపై ఉన్న 914 మర్రిలను జియో ట్యాగ్ చేశాం. ప్రతి చెట్టుకు ఆధార్ కార్డ్ ని సృష్టించాము.డేటాబేస్ పబ్లిక్‌గా అందుబాటులో ఉంటుంది” అని ఆమె చెప్పింది.