Ponguleti Srinivas Reddy: తెలంగాణాలో బలమైన పార్టీగా ఎదిగిన బీఆర్ఎస్ బీటలు వారుతున్నాయి. పార్టీలో అంతర్గత కుమ్ములాట బయటపడుతుంది. వర్గవిభేదాలతో బీఆర్ఎస్ రోజురోజుకు వీక్ అయిపోతుంది. తెలంగాణ నినాదంతో అధికారం చేపట్టిన బీఆర్ఎస్ ప్రస్తుతం తెలంగాణ నినాదాన్ని పక్కనపెట్టేసి రాజకీయ పార్టీగా చెప్పుకుంటుంది. స్వయంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ విషయాన్ని ప్రకటించారు. టీఆర్ఎస్ పేరుతో పార్టీ నడిచినన్ని రోజులు పార్టీ పరిస్థితి ఫర్వాలేదు అనిపించినా… టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిన తర్వాత పరిస్థితులు మారాయి. తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ని నమ్మే పరిస్థితుల్లో లేరు. మరీ ముఖ్యంగా తెలంగాణని గాలికి వదిలేసి మహారాష్ట్ర, ఢిల్లీ, ఏపీ అంటూ ఇతర రాష్ట్రాలపై ఫోకస్ చేస్తున్నాడన్న విమర్శలు అయితే ప్రధానంగా వినిపిస్తున్నాయి.
తెలంగాణాలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ప్రజల మద్దతు భారీగా ఉంది. ఆయన ఏ పార్టీలో ఉన్నా.. ప్రజలు మాత్రం ఆయన వెంటే నడుస్తున్నారు. ఇక ఇటీవల పొంగులేటి కెసిఆర్ పై తీవ్ర విమర్శలు చేసి పార్టీ నుంచి సస్పెండ్ కు గురయ్యారు. సస్పెండ్ అనే దానికంటే ఆయనే స్వయంగా పార్టీపై యుద్ధం ప్రకటించారు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం పొంగులేటి దారెటు అనేది తెలియకపోయినా ఆయన అనుచర వర్గం మాత్రం పొంగులేటితోనే మా ప్రయాణం అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పొంగులేటి అనుచరులు బీఆర్ఎస్ ను వీడి బయటకు రావడం జరిగింది. ఇక తాజాగా పొంగులేటి వర్గానికి చెందిని జెడ్పిటిసి బీఆర్ఎస్ పార్టీ వీడారు. జెడ్పిటిసితో పాటు 30 మంది వార్డ్ మెంబర్లు బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బయటకు వచ్చారు. తామంతా పొంగులేటి వర్గం వారమని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో మా ప్రయాణం అంటూ ప్రకటించారు.
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం జెడ్పిటిసి జాటోత్ ఝాన్సీ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఆమెతో పాటు 30 మంది వార్డు మెంబర్లు. అలాగే మండల స్థాయి బీఆర్ఎస్ కార్యకర్తలు పార్టీని వీడారు. పార్టీకి రాజీనామా అనంతరం ఝాన్సీ మాట్లాడారు. మేము పొంగులేటి వర్గమని, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోరం కనకయ్యను బీఆర్ఎస్ సస్పెండ్ చేసిందని, వాళ్ళు లేని పార్టీలో ఉండలేమని పేర్కొన్నారు.