Ganja : హైద‌రాబాద్‌లో అంత‌రాష్ట్ర గంజాయి స‌ర‌ఫ‌రా ముఠా అరెస్ట్‌

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా గంజాయి స‌ర‌ఫ‌రా చేస్తున్నా ముఠా గుట్టు ర‌ట్టు చేశారు సౌత్ జోన్ పోలీసులు.

  • Written By:
  • Updated On - July 24, 2022 / 04:40 PM IST

తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో అక్రమంగా గంజాయి స‌ర‌ఫ‌రా చేస్తున్నా ముఠా గుట్టు ర‌ట్టు చేశారు సౌత్ జోన్ పోలీసులు. అంతర్రాష్ట్ర గంజాయి సరఫరాదారు సహా నలుగురిని హుస్సేనీఆలం పోలీసులతో పాటు సౌత్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం శనివారం పట్టుకుంది. నిందితుడి వద్ద 102 కిలోల గంజాయి, ఒక స్విఫ్ట్ డిజైర్ కారును సీజ్ చేశారు. నిందితులు వరంగల్‌కు చెందిన డ్రైవర్ తోకల కుమార స్వామి, తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంకు చెందిన కారు డ్రైవర్ జి. అర్జున్, సిద్దిపేటకు చెందిన డ్రైవర్ కమ్ కమీషన్ ఏజెంట్ షేక్ ఆజం, అనకాపల్లి జిల్లా నర్సీపట్నంకు చెందిన బంగారి శివగా గుర్తించారు. నర్సీపట్నంకు చెందిన గొర్లి నాయుడు ప్రధాన గంజాయి సరఫరాదారు పరారీలో ఉన్నాడు,

20 లక్షల విలువైన 102 కిలోల గంజాయి, ఒక స్విఫ్ట్ డిజైర్ కారు, మూడు సెల్‌ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్‌కు చెందిన ప్రధాన నిందితుడు కుమార స్వామి (52) డబ్బు సంపాదించేందుకు గంజాయి సరఫరా చేయడం ప్రారంభించాడని, 2015లో వరంగల్‌లోని మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్‌లో ఎన్‌డిపిఎస్ కేసులో, రాజమండ్రిలో మరో ఎన్‌డిపిఎస్ కేసులో అరెస్టయ్యాడని సౌత్ జోన్ డిప్యూటీ కమిషనర్ పి.సాయి చైతన్య తెలిపారు. ఖమ్మం, నర్సీపట్నం, ఒడిస్సాలో గంజాయి సరఫరా చేసే ప్రధాన వ్యాపారులతో పరిచయాలు ఏర్పరచుకుని రాజమండ్రి కోర్టులో గొర్లి నాయుడు అలియాస్ చిన్నాతో పరిచయం ఏర్పడింది.

జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్, వరంగల్, మహారాష్ట్ర పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా కొనసాగించాడు. తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగించేందుకు కుమార స్వామి కస్టమర్లను ఏర్పాటు చేసేందుకు ఇతర నిందితులను సంప్రదించి ఆరు నుంచి ఎనిమిది మందితో కూడిన ముఠాను ఏర్పాటు చేశాడు. ఇదిలా ఉండగా పక్కా సమాచారంతో హుస్సేనీ ఆలం పరిధిలోని పురానాపూల్ దర్వాజా వద్ద నిందితులను పట్టుకుని గంజాయి, స్విఫ్ట్ డిజైర్ కారు, మూడు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను, స్వాధీనం చేసుకున్న సామాగ్రిని విచారణ నిమిత్తం ఎస్‌హెచ్‌ఓ హుసేనీఆలం పీఎస్‌కు అప్పగించారు.