Gandhi Hospital:కోవిడ్ రోగుల సేవ‌ల్లో దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా గాంధీ” ఆసుప‌త్రి

దేశంలోనే పెద్ద సంఖ్యలో కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న తొలి ఆసుపత్రిగా హైద‌రాబాద్ గాంధీ ఆసుపత్రి నిలిచింది. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా 84,127 మంది కోవిడ్ రోగులకు ఇక్క‌డ చికిత్స జ‌రిగింది.

  • Written By:
  • Updated On - December 14, 2021 / 09:39 AM IST

దేశంలోనే పెద్ద సంఖ్యలో కరోనా సోకిన రోగులకు చికిత్స అందిస్తున్న తొలి ఆసుపత్రిగా హైద‌రాబాద్ గాంధీ ఆసుపత్రి నిలిచింది.
ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా 84,127 మంది కోవిడ్ రోగులకు ఇక్క‌డ చికిత్స జ‌రిగింది.
కోవిడ్ -19 వ్యాప్తి నుండి గాంధీ ఆసుపత్రిలో 84,127 మంది రోగులు కరోనావైరస్ బారిన పడి చికిత్స పొందారని గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు తెలిపారు. ఇంత మంది రోగులకు దేశంలోని మరే ఆసుపత్రి కూడా చికిత్స చేయలేదని.. కోవిడ్‌కు చికిత్స పొందిన వారిలో 3,762 మంది 14 ఏళ్లలోపు పిల్లలు ఉన్నార‌ని ఆయ‌న తెలిపారు.వీరితో పాటు హై-రిస్క్ గ్రూపులకు చెందిన 8,178 మంది డయాలసిస్ రోగులు కూడా చికిత్స పొందార‌ని…. మెరుగైన చికిత్స అందించడం వల్ల 98 శాతం రికవరీ రేటును గాంధీ ఆసుపత్రి సాధించింద‌ని తెలిపారు.

ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 44 మంది కోవిడ్‌ రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నారు. కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ రోగులకు కూడా వైద్యులు చికిత్స చేశారు. బ్లాక్ ఫంగస్ బాధితులు ఇప్పటి వరకు 1,786 మంది ఆసుపత్రిలో చేరారని… వీరిలో 1,163 మందికి శస్త్రచికిత్సలు చేసి ప్రాణాలు కాపాడామ‌ని వైద్యులు తెలిపారు. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ఎక్కువ మంది బ్లాక్ ఫంగస్ రోగులు వచ్చారన్నారని తెలిపారు. క‌రోనా రెండ‌వ ద‌శ‌లో గాంధీ ఆసుప‌త్రిలో రోగుల తాకిడి ఎక్కువ అయింది. పూర్తిస్థాయిలో క‌రోనా రోగుల‌కు మాత్ర‌మే చికిత్స అందిస్తూ చాలామంది ప్రాణాల‌ను గాంధీ ఆసుప‌త్రి వైద్యులు కాపాడారు.