Telangana Congress: తన పాటలతో తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రుతలూగించిన ప్రజాయుద్ధనౌక గద్దర్ ఇటీవల అనారోగ్యానికి గురై చనిపోయిన విషయం తెలిసిందే. అమ్మా తెలంగాణమా అంటూ ఆకలి కేకల గానాలతో అణువనువునూ తట్టిలేపిన గద్దర్ రాజకీయ నేపధ్యపు పాటలతో ప్రజల్లో చైతనయం కలిగించారు. తెలంగాణ గోసకు పతాకమై నిలుస్తూ.. జనం గుండెలను రగిలించిన గద్దర్ కాంగ్రెస్ పార్టీకి ప్రియమైన వ్యక్తిగా కొనసాగుతూ వచ్చారు. గద్దర్ చివరిసారిగా రాహుల్ గాంధీని బహిరంగ సభపై కలిసి ముద్దాడిన తీరు ప్రతి ఒక్కరిని భావోద్వేగానికి గురి చేసింది.
గద్దర్ కుటుంబ సభ్యులను ఏఐసీసీ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీలు ఓదార్చారు. తాజ్ కృష్ణా హోటల్‌లో ఆదివారం గద్దర్ భార్య విమల, కూతురు వెన్నెల, కుమారుడు సూర్యం.. ఆయన భార్యను వారు కలిసి ధైర్యం చెప్పారు. గద్దర్ తనకు అత్యంత ప్రియమైన వ్యక్తి అని రాహుల్ గాంధీ అన్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడిన రాహుల్ గద్దర్ కుటుంబానికి ధైర్యం చెప్పారు. సోనియాగాంధీ తన ఆరోగ్య కారణాలరీత్యా గద్దర్ కుటుంబ సభ్యులని తన వద్దకు పిలిపించుకుని ఓదార్చారు. గద్దర్ ప్రజల హక్కుల కోసం చేసిన పోరాట స్ఫూర్తిని సోనియాగాంధీ కొనియాడారు.
రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన కాంగ్రెస్ విజయభేరి సభలో 6 గ్యారెంటీలను కాంగ్రెస్ నేతలు ప్రకటించారు. మహాలక్ష్మి పథకాన్ని సోనియా గాంధీ ప్రకటించగా.. రైతుభరోసా పథకాన్ని మల్లికార్జున ఖర్గే ప్రకటించారు. అనంతరం రాహుల్ గాంధీ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం, యువవికాసం పథకం ప్రకటించారు. చరిత్రాత్మకమైన రోజున తెలంగాణ ప్రజలకు ఈ 6 గ్యారెంటీలు ఇస్తున్నామని తెలిపారు.