Gadala The Leader : ‘‘నా మార్గం.. నా ఇష్టం.. ప్రజాసేవ కోసమే నా పొలిటికల్ ఎంట్రీ’’ అని తెలంగాణ రాష్ట్ర మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ‘హ్యాష్‌ట్యాగ్ యూ’కు ఇచ్చిన మొట్టమొదటి ఇంటర్వ్యూలో తెలిపారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాలపై తనకున్న ఇష్టం, ఆసక్తి వల్లే పాలిటిక్స్‌లోకి(Gadala The Leader) వస్తున్నట్లు స్పష్టం చేశారు. ‘‘నా ఉద్యోగ విరమణకు మరో ఆరున్నర సంవత్సరాల టైం ఉంది. వాస్తవానికి నేను 2031 నాటికి రిటైర్ కావాలి. కానీ ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి వచ్చేందుకు ఇదే కరెక్ట్ టైం అనిపించింది. కుటుంబ సభ్యులు, సన్నిహితులతో చర్చించిన తర్వాత రాజకీయాల్లో రావాలని నిర్ణయించుకున్నాను’’ అని గడల వెల్లడించారు. ‘‘గత 30 ఏళ్లుగా నేను సికింద్రాబాద్‌లో ఉంటున్నాను. అందుకే సికింద్రాబాద్ లోక్‌సభ సీటుతో పాటు నా సొంత జిల్లా ఖమ్మం లోక్‌సభ టికెట్ కోసం కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్ ఇచ్చాను. నేను జాబ్‌కు రిజైన్ చేసిన మరుసటి రోజు ఈ దరఖాస్తును సబ్మిట్ చేశాను’’ అని వివరించారు. తనకు లోక్‌సభ టికెట్ ఇవ్వడం ఇవ్వకపోవడం అనేది కాంగ్రెస్ పార్టీ ఇష్టమన్నారు. 25 సంవత్సరాల పాటు వైద్యాధికారిగా ప్రజాజీవితం గడిపిన తనకు లోక్‌సభకు పోటీ చేసేందుకు అవసరమైన అన్ని అర్హతలు ఉన్నాయని నమ్ముతున్నట్లు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join
కొవిడ్ టైంలో వ్యక్తిగతంగా నష్టపోయాను
‘‘కరోనా టైంలో తెలంగాణ హెల్త్ డైరెక్టర్‌గా పనిచేయడం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రాష్ట్ర ప్రజలను అప్రమత్తం చేస్తూ.. ప్రాణనష్టాన్ని తగ్గించే మార్గదర్శకాలను ఇస్తూ చాలా బిజీగా విధులు నిర్వర్తించాను. అతి తక్కువ నష్టంతో కొవిడ్ ముప్పు నుంచి తెలంగాణ రాష్ట్ర గట్టెక్కేలా చేసేందుకు నా వంతుగా ప్రయత్నాలు చేశాను’’ అని గడల శ్రీనివాస్ చెప్పారు. ‘‘కొవిడ్ టైంలో నేను వ్యక్తిగతంగా చాలా నష్టపోయాను. కొవిడ్‌తో మా నాన్న గారిని కోల్పోయాను. నాకు కూడా ఆ టైంలోనే గుండె సమస్య వస్తే స్టంట్ వేసుకున్నాను. స్టంట్ వేసుకున్న నెక్ట్స్ రోజు నుంచే డ్యూటీని మొదలుపెట్టాను. ప్రజల పట్ల నాకున్న అంకిత భావానికి అదే నిదర్శనం’’ అని ఆయన వివరించారు. ఇకపై పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వస్తున్నానని గడల శ్రీనివాస్ పేర్కొన్నారు.
Also Read : Paytm Vs Phonepe : ఫోన్ పే, భీమ్ యాప్‌లకు రెక్కలు.. పేటీఎం కొనుగోలుకు 2 కంపెనీల పోటీ
కులాలు, మతాలు అడగను
‘‘గత కొన్నేళ్లుగా మా నాన్న గారి పేరు మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విద్య, ఆరోగ్య, ఉపాధి పరంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. నేను పుట్టిన ప్రాంతానికి కొంతైనా తిరిగివ్వాలనే సదుద్దేశంతోనే ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నాను’’ అని చెప్పారు. తాను నడుపుతున్న ట్రస్టు ద్వారా పేదలకు, బాధల్లో ఉన్నవారికి సాయం చేసేటప్పుడు కులాలు, మతాలు అడగనని ఆయన తెలిపారు. ‘‘రాజకీయాల్లో కులం కార్డు వాడుకోవడంలో తప్పేం లేదు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా నేటికీ ఎన్నో కులాలు, అణగారిన వర్గాల ప్రజలకు రాజకీయాల్లో తగిన అవకాశం దక్కలేదు. నేను బీసీని.. మున్నూరు కాపు బిడ్డగా రాజకీయాల్లో అవకాశాన్ని పొందాలని భావించడం సబబే. బీసీల ప్రతినిధిగా ఎదగాలని అనుకుంటున్నాను. జనాభా ప్రాతిపదికన అన్ని కులాలకు రాజకీయాల్లో తగిన అవకాశాలు దక్కాలి. ఈ లక్ష్యంతోనే కాంగ్రెస్ పార్టీ కులగణన అంశాన్ని తెరపైకి తెచ్చింది’’ అని గడల వివరించారు. ‘‘దరఖాస్తులను స్వీకరించి.. అభ్యర్థులను ఎంపిక చేసే పద్ధతి నాకు కాంగ్రెస్ పార్టీలో బాగా నచ్చింది.. నా వంతుగా అప్లై చేశాను. తుది నిర్ణయం పార్టీదే’’ అని ఆయన తెలిపారు.