Site icon HashtagU Telugu

Telangana : తెలంగాణ కాంగ్రెస్ లో పెరుగుతున్న జోష్

Full Josh In Telangana Congress

Full Josh In Telangana Congress

మొన్నటి వరకు ఓ లెక్క..ఇప్పటి నుండి ఓ లెక్క అంటుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీ (Telangana Congress ). కాంగ్రెస్ పార్టీ అంటేనే గ్రూప్ తగాదాలు..నేతల మధ్య గొడవలు.. నియోజకవర్గంలో విభేదాలు ఉంటాయని ప్రతి ఒక్కరు మాట్లాడుకుంటారు. కానీ ఇప్పుడు ఆలా ఏమిలేకుండా అంత ఒకటే అనే నినాదం తో ఎన్నికల్లోకి వెళ్లాలని డిసైడ్ అయ్యింది. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ టిక్కెట్ల లొల్లి ఉండకుండా ముందే అభ్యర్థుల ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ నెలాఖరులోగానే 80 నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖారారు చేయబోతుంది.

గత ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ముందే బీఆర్ఎస్ (BRS) అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో జాప్యం అధికార పార్టీకి బాగా కలిసొచ్చింది. అందుకే ఈసారి ఆ ఛాన్స్ బిఆర్ఎస్ కు ఇవ్వకుండా బిఆర్ఎస్ కంటే ముందే అభ్యర్థులను ప్రకటించాలని కాంగ్రెస్ డిసైడ్ అయ్యింది. మరోపక్క కాంగ్రెస్ పార్టీ లో పెద్ద ఎత్తున చేరికలు మొదలయ్యాయి. బిఆర్ఎస్ ఫై అసంతృప్తి తో ఉన్న నేతలంతా కాంగ్రెస్ పార్టీ లో చేరేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.

ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  (Ponguleti Srinivas Reddy) వంటి ప్రజాభిమానం ఉన్న నేత చేరడం కాంగ్రెస్ పార్టీ కి బాగా కలిసొచ్చింది. ఖమ్మం జిల్లాలో పొంగులేటి ఫై ప్రజల్లో ఉన్న అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు పొంగులేటి చేసిన సాయమే ఆయన్ను ప్రజానాయకుడ్ని చేసింది. అలాంటి నేత కాంగ్రెస్ లో చేరడం తో పార్టీ కి మరింత బూస్ట్ ఇచ్చినట్లు అయ్యింది.

ఖమ్మంలో పదికి పది సీట్లు కాంగ్రెస్ పార్టీ వే అనే ధీమా అందరిలో కలుగుతుంది. ఇక ఈరోజు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao)తో సహా పలువురు నేతలు కాంగ్రెస్ లో చేరడం మరింత జోష్ నింపుతుంది. ఎన్నికల సమయం నాటికీ భారీ ఎత్తున చేరికలు ఉంటాయని చెపుతున్నారు. అందుకే కాంగ్రెస్ లో చేరిన వారిని ఏమాత్రం డిస్పాయింట్ చేయకుండా వారికీ టికెట్స్ ఇచ్చేందుకు కాంగ్రెస్ అధిష్టానం సిద్ధం అవుతుంది.

మరోపక్క కాంగ్రెస్ అధిష్టానం సైతం తెలంగాణ ఫై పూర్తి ఫోకస్ పెట్టింది. ఎప్పటికప్పుడు తెలంగాణ లో రాజకీయాల గురించి తెలుసుకుంటూ..దానికి తగ్గట్లు ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. అలాగే బస్సు యాత్రల ద్వారా కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉన్న ఐక్యతను చాటి చెప్పాలని, సభలు, సమావేశాలు నిర్వహించి పాలక బీఆర్ఎస్ పై ప్రజావ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకోవాలని, క్షేత్రస్థాయిలో బలాన్ని చేకూర్చాలని కాంగ్రెస్ పార్టీ వ్యూహరచన చేస్తోంది.

బిజెపి – బీఆర్ఎస్ (BRS, BJP) పార్టీల మధ్య ఉన్న స్నేహ బంధాలను ఎండగట్టడంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏ ఏ వర్గాలకు ఏ విధంగా లబ్ధి చేకూరుస్తుంది అన్న విషయంపై విస్తృతంగా ప్రచారం సాగించాలని..కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు సూచించినట్లు తెలుస్తుంది. కర్ణాటక తరహాలో ఎన్నికలకు వెళ్లాలని, తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ నేతలందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఇప్పటీకే ఆదేశాలు జారీ చేసింది. మరోపక్క రాష్ట్ర ప్రజలు సైతం ఈసారి కాంగ్రెస్ ను గెలిపిద్దాం అనే ఆలోచన కూడా చేస్తున్నారు. రెండుసార్లు కేసీఆర్ కు ఛాన్స్ ఇచ్చాం..ఈసారి కాంగ్రెస్ కు ఇచ్చి చూద్దాం అనే ఆలోచన కూడా చేస్తున్నారు. మరి ఈ ఆలోచన ఓటు వేసి వరకు ఉంటుందా..లేదా అనేది చూడాలి. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ లో చేరికలు..ఆ పార్టీ శ్రేణుల్లో జోష్ నింపుతుంది.

Read Also : Andhra Pradesh : అమరావతి ఆర్-5 జోన్ లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే

Exit mobile version