- మందు బాబుల కోసం ఉచిత రైడ్ సేవలను
- మద్యం మత్తులో నడవలేని వారిని ఉచితంగా ఇంటికి చేరుస్తారు
- TGPWU నిర్ణయం పట్ల మందుబాబుల హర్షం
కొత్త సంవత్సర వేడుకల వేళ రహదారి భద్రతను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫామ్ వర్కర్స్ యూనియన్ (TGPWU) ఒక అద్భుతమైన నిర్ణయాన్ని ప్రకటించింది. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాలను నివారించేందుకు ‘మందు బాబుల’ కోసం ఉచిత రైడ్ సేవలను అందించనున్నట్లు తెలిపింది. సాధారణంగా న్యూ ఇయర్ వేడుకల్లో ఉత్సాహంలో మద్యం సేవించి, ఆ స్థితిలో వాహనాలు నడపడం వల్ల ప్రతి ఏటా అనేక ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ ముప్పును తగ్గించేందుకు డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లతో కూడిన ఈ యూనియన్ సామాజిక బాధ్యతతో ముందుకు రావడం విశేషం.
Free Ride For Drug Addicts
ఈ ఉచిత సేవలు హైదరాబాద్‌లోని మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అందుబాటులో ఉంటాయి. హైదరాబాద్, సైబరాబాద్, మరియు రాచకొండ పరిధిలోని ప్రధాన కూడళ్లలో ఇవాళ రాత్రి 11 గంటల నుండి జనవరి 1వ తేదీ అర్ధరాత్రి 1 గంట వరకు ఈ సర్వీసులు కొనసాగుతాయి. మద్యం తాగి వాహనం నడపలేని స్థితిలో ఉన్నవారు లేదా ప్రమాదకరంగా ప్రయాణించే అవకాశం ఉన్నవారు 8977009804 అనే నంబర్‌కు కాల్ చేసి ఈ ఉచిత రైడ్ సేవలను పొందవచ్చు. వేడుకల అనంతరం క్షేమంగా ఇంటికి చేరుకోవడానికి ఇదొక సురక్షితమైన మార్గమని యూనియన్ నేతలు పేర్కొంటున్నారు.
పోలీసు యంత్రాంగం ఇప్పటికే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను ముమ్మరం చేసిన నేపథ్యంలో, ఈ ఉచిత రైడ్ సేవలు అటు ప్రజలకు, ఇటు భద్రతా సిబ్బందికి ఎంతో సహాయకారిగా మారనున్నాయి. కేవలం జరిమానాల భయంతో కాకుండా, ప్రాణ రక్షణే ధ్యేయంగా యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి. ఒకవైపు వేలాది మంది గిగ్ వర్కర్లు తమ ఉపాధిని పక్కన పెట్టి, సమాజ క్షేమం కోసం ఈ రాత్రి శ్రమించబోతుండటం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
