Telangana IT: ఐటీకి ప్రాధాన్యత ఇస్తాం..ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులతో సీఎం రేవంత్

తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు.

Telangana IT: తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పారిశ్రామికవేత్తలకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ఆయన చెప్పారు. ఈ రోజు ఫాక్స్‌కాన్‌ ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలను కాపాడాల్సిన బాధ్యత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఉందన్నారు. అన్ని వర్గాలతో స్నేహపూర్వకంగా ఉండే విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు.

పారిశ్రామికవేత్తలకు తమ ప్రభుత్వం తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని ఈ సందర్భంగా వెల్లడించారు. పరిశ్రమల అభివృద్ధికి, స్థాపనకు అవసరమైన అనుమతులు సులువుగా కల్పిస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని రేవంత్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామి పరిశ్రమగా నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. తెలంగాణలో ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ అభివృద్ధిని వేగవంతం చేస్తామన్నారు. కొంగర కలాన్‌లోని ఫాక్స్‌కాన్‌ తయారీ కేంద్రం నిర్వహణకు అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఫాక్స్‌కాన్‌ సంస్థ భవిష్యత్‌లో చేపట్టనున్న ప్రాజెక్టులకు కూడా ప్రభుత్వం నుంచి అవసరమైన సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

ఈ ఏడాది మార్చిలో ఫాక్స్‌కాన్ గ్రూప్ గత ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫాక్స్‌కాన్ కంపెనీ ప్రధానంగా యాపిల్ ఐఫోన్‌లను తయారు చేస్తుంది. ఫాక్స్‌కాన్ చైనా, వియత్నాం, థాయిలాండ్, మలేషియా, అమెరికా, యూరప్ మరియు భారతదేశంతో సహా 24 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఎలక్ట్రానిక్స్ పరికరాలు, తయారీ వ్యవస్థలను ఏర్పాటు చేయడం ద్వారా లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వంతో ఫాక్స్‌కాన్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి దశలో కంపెనీ రాబోయే రెండేళ్లలో 25,000 ఉద్యోగాలను సృష్టిస్తుంది.

Also Read: Most Deleted App : 2023లో ఎక్కువమంది డిలీట్ చేసిన యాప్స్ ఇవే..