Four Schemes: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మక రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇండ్ల పథకాలను (Four Schemes) రాష్ట్రంలోని ప్రతీ మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అర్హులైన వారందరికీ అందించాలని నిర్ణయించిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వెల్లడించారు. జాతీయ పర్వదినమైన గణతంత్ర దినోత్సవం నాడు ఈ పథకాలను ప్రారంభిస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్లతో సీఎస్ శాంతి కుమారి సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం కార్యాలయ కార్యదర్శులు శేషాద్రి, చంద్ర శేఖర్ రెడ్డి, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, గృహనిర్మాణ శాఖ కార్యదర్శి ప్రకాష్ , పంచాయితీ రాజ్ శాఖ కార్యదర్శి లోకేష్ కుమార్, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ.. ప్రతి మండలంలో ఒక గ్రామాన్ని ఎంపిక చేసి ఆ గ్రామంలో ఈ నాలుగు పథకాలను అర్హులైన లబ్దిదారులందరికీ అందించాలని స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం ఒంటి గంటకు ఎంపిక చేసిన గ్రామాల్లో ప్రజా ప్రతినిధుల సమక్షంలో ఈ పథకాల పండుగను ప్రారంభించాలని తెలిపారు. నాలుగు పథకాలకు గాను రేషన్ కార్డులకు సంబంధించి తహసీల్దార్ నేతృత్వంలో ప్రత్యేక టీమ్, ఇందిరమ్మ ఇండ్లకు గాని ఎండీఓ ఆధ్వర్యంలో, రైతు భరోసాకు మండల వ్యవసాయ అధికారి, డిప్యూటీ తహసీల్దార్ లేదా రెవెన్యూ ఇన్స్పెక్టర్ టీమ్, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఉపాధి హామీ పథకం ఏపీఓ టీమ్‌లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకోవాలని సీఎస్ సూచించారు. పథకాల ప్రారంబోత్సవ ఏర్పాట్లు ఈ రోజు సాయంత్రం నుండే మొదలు పెట్టుకోవాలని సూచించారు.
Also Read: Asif Bashir : భారతీయులను కాపాడిన పాక్ అధికారికి అత్యున్నత పురస్కారం
ఈ పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమం పండగ వాతావరణంలో నిర్వహించాలని, ఈ సభకు లబ్దిదారులందరూ హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతీ పథకానికి సంబంధించి లబ్ధిదారుల జాబితాను ఈ గ్రామసభలో ప్రముఖంగా ప్రదర్శించాలని తెలిపారు. ఈ కార్యక్రమం ప్రారంభించే ప్రతీ గ్రామానికి మండల స్పెషల్ అధికారి ఇంఛార్జిగా నియమించాలన్నారు. జిల్లా కలెక్టర్లు అర్హుల జాబితాను క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్పారు.