Telangana Airports : తెలంగాణలో కొత్తగా మరో నాలుగు ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి రానున్నాయి. వరంగల్‌లోని మామునూరు, భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్‌లలో కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సీఎం రేవంత్ సర్కారు రెడీ అయ్యింది. ఇక కేంద్రంలో పౌర విమానయాన శాఖ మంత్రిగా తెలుగు వ్యక్తి రామ్మోహన్‌నాయుడు ఉండడంతో అనుమతుల విషయంలోనూ సానుకూల స్పందన వచ్చే ఛాన్స్ ఉంది. అయితే హైదరాబాద్ తర్వాత తెలంగాణలోనే అతిపెద్ద నగరమైన వరంగల్‌లో ఉన్న మామునూరులో తొలుత ఎయిర్‌పోర్టు అందుబాటులోకి రానుంది.
Also Read :BRS MLAs : త్వరలో బీఆర్ఎస్ నుంచి ఇద్దరు మాజీ మంత్రులు జంప్ ?
తొలి విడతలో మామునూరు ఎయిర్‌పోర్టును(Telangana Airports) చిన్న విమానాల రాకపోకలకు అనుగుణంగా సిద్ధం చేస్తారు. వరంగల్ మహానగరం మాస్టర్ ప్లాన్ తయారీకి ఇప్పటికే ఆమోదం లభించింది. మాస్టర్ ప్లాన్ అమలుతో పాటు మామునూరు ఎయిర్‌పోర్టు అభివృద్ధి ప్రక్రియను 2025 డిసెంబరుకల్లా పూర్తి చేయాలని తెలంగాణ సర్కారు టార్గెట్‌గా పెట్టుకుంది. ఆ తర్వాత 2027 సంవత్సరం నాటికి రెండో దశలో పెద్ద విమానాలు, కార్గో విమానాల ఆపరేషన్‌కు వీలుగా మామునూరు ఎయిర్ పోర్టును డెవలప్ చేస్తారు. వాస్తవానికి నిజాం నవాబు పాలనా కాలంలో మామునూరులో ఎయిర్ పోర్టు ఉండేది. దీనికి ఇప్పటికే 696.14 ఎకరాల భూమి ఉంది. ఎయిర్ పోర్టు కోసం అదనంగా మరో 253 ఎకరాలను సేకరించేందుకు తెలంగాణ సర్కారు రూ.205 కోట్లను ఇటీవలే విడుదల చేసింది.
Also Read :Road Tax Hike : త్వరలోనే పెట్రోల్, డీజిల్ వాహనాల ‘రోడ్ ట్యాక్స్’ పెంపు
రాబోయే నాలుగేళ్లలో భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం, ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టులు కూడా అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటు కోసం మూడు మండలాల పరిధిలో దాదాపు వెయ్యి ఎకరాల్లో భూసేకరణపై ఓ అంచనాకు వచ్చారు. రామగుండం పట్టణం సమీపంలో ఉన్న బసంత్‌నగర్‌లో గతంలోనే ఎయిర్‌పోర్టు ఉండేది. బీకే బిర్లా తమ సిమెంట్ పరిశ్రమ సమావేశాలకు రావడానికి దీన్ని అప్పట్లో ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో కొత్తది ఏర్పాటు చేయాలని తెలంగాణ సర్కారు యోచిస్తోంది. ఆదిలాబాద్‌లో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు దాదాపు 1,592 ఎకరాల్లో భూమి రెడీగా ఉందని తెలుస్తోంది. అయితే ఈ మూడు ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుకు ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) నుంచి అనుమతులను పొందాల్సి ఉంది.