Site icon HashtagU Telugu

Karimnagar : క‌రీంన‌గ‌ర్‌లో నాలుగు ఇంటిగ్రేటెడ్ మార్కెట్లు.. వ‌చ్చే మూడు నెల‌ల్లో పూర్తి చేస్తామ‌న్న మంత్రి గంగుల‌

integrated markets

integrated markets

కరీంనగర్‌లో నిర్మిస్తున్న నాలుగు ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్లను రానున్న మూడు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హామీ ఇచ్చారు. రాంనగర్‌ సమీకృత మార్కెట్‌లో జరుగుతున్న పనులను మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ పరిశీలించారు. రానున్న మూడు నెలల్లో నాలుగు మార్కెట్లను పూర్తి చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కమలాకర్ మాట్లాడుతూ.. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో రూ.40 కోట్లతో ప్రజల సౌకర్యార్థం నాలుగు సమీకృత మార్కెట్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఒక్కో మార్కెట్ కి రూ.10 కోట్లు నిర్మాణ ఖ‌ర్చు అవుతుంద‌ని తెలిపారు.

ట్రాఫిక్ సమస్యలను నివారించడమే కాకుండా, వెజ్, నాన్ వెజ్, పండ్లు, పూల మార్కెట్‌లతో సహా అన్ని రకాల మార్కెట్‌లు ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌లలో ఒకే చోట అందుబాటులో ఉంటాయన్నారు. భారీ పార్కింగ్ స్థలంతో పాటు తాగునీరు, ఇతర సౌకర్యాలను కూడా అభివృద్ధి చేస్తామన్నారు. మార్కెట్‌ లేకపోవడంతో 3 వేల మంది వ్యాపారులు రోడ్లపైనే వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, వారందరికీ ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌లో వసతి కల్పిస్తామని చెప్పారు. మేయర్ వై సునీల్ రావు, మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిపై వివిధ శాఖల అధికారులతో కమలాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.