IAS Aravind Kumar : ఫార్ములా-ఈ కార్ రేసింగ్ వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌కు తెలంగాణ సర్కారు మెమో జారీ చేసింది. ఫార్ములా ఈ రేసు ఒప్పందంలోని కొన్ని అంశాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఫార్ములా-ఈతో త్రైపాక్షిక లాంగ్ ఫారమ్ ఒప్పందం ఎందుకు కుదుర్చుకున్నారో తెలపాలని అరవింద్ కుమార్‌ను వివరణ కోరింది. క్యాబినెట్ అనుమతి, ఆర్థిక శాఖ ఆమోదం లేకుండా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న టైంలో(2023 అక్టోబర్30న) రూ.55 కోట్లను హెచ్‌ఎండీఏ నుంచి ఫార్ములా ఈ రేసుకు బదిలీ చేసిన అంశంపై వారంలోగా వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నోటీసులు జారీ చేశారు. ఫార్ములా ఈ రేసింగ్ పోటీల నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏ నుంచి బిల్లుల రూపంలో రూ.46కోట్లు, పన్నుల రూపంలో మరో రూ.9 కోట్లను చెల్లించడానికి కారణాలు ఏమిటన్నది తెలపాలని సీఎస్ ఆదేశించారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదాలో ఉన్న అరవింద్‌కుమార్‌కు(IAS Aravind Kumar) నోటీసులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం.. ఫార్ములా కార్ రేసింగ్ సంస్థకు కూడా బదులిచ్చింది. ప్రభుత్వంతో ప్రైవేట్ సంస్థ ఒప్పందం కుదుర్చుకునే క్రమంలో నిబంధనలు పాటించనందున ముందుగా చెల్లించిన డబ్బును వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేసింది.
We’re now on WhatsApp. Click to Join.
గత ఏడాది ఫిబ్రవరి 11న హైదరాబాద్‌లో జరిగిన సీజన్-9 పార్ములా-ఈ రేస్ నిర్వహణకు రూ.200 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో ఈవెంట్ నిర్వాహక సంస్థలైన గ్రీన్‌కో రూ.150 కోట్లు, హైదరాబాద్ రేసింగ్ లిమిటెడ్ రూ.30కోట్లు ఖర్చుచేశాయి. రహదారులు, ఇతర మౌలిక వసతులకు హెచ్ఎండీఏ రూ.20 కోట్లు ఖర్చు చేసింది. ఈ ఏడాది తలపెట్టిన ఫార్ములా-ఈ 10వ సీజన్ ఈవెంట్కు రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫెసిలిటేటర్‌గా ఉండాల్సి ఉంది. ఖర్చు మొత్తం ప్రైవేటు సంస్థలైన గ్రీన్ కో ఫార్ములా ఈ సంస్థ భరించాల్సి ఉంది.అయితే ఎన్నికల సంఘం అనుమతి తీసుకోకుండా, ఆర్థికశాఖ దృష్టికి తీసుకెళ్లకుండానే ఆ ఉన్నతాధికారి ఈవెంట్ నిర్వహణకు హెచ్ఎండీఏ నుంచి ముందస్తు చెల్లింపులు చేశారు. గ్రీన్ కో స్థానంలో హెచ్‌ఎండీఏకు కార్ల రేసింగ్ నిర్వహణ బాధ్యతలు బదిలీ చేశారు. దీనివల్ల ఫిబ్రవరి 10న ఈవెంట్ నిర్వహిస్తే హెచ్ఎండీఏపై రూ.200 కోట్ల భారం పడేది. ఈ ఏడాది ఫిబ్రవరి 10న హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ కార్ రేసింగ్ పోటీలను రద్దు చేసినట్లు ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈఓ) ఇటీవల ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో పోటీల వేదికను మెక్సికో దేశానికి మార్చినట్లు వెల్లడించింది. ఈ పోటీలపై గతేడాది అక్టోబర్ 30న కుదిరిన ఒప్పందాన్ని తెలంగాణ సర్కారు ఉల్లంఘించిందని ఎఫ్‌ఈఓ ఆరోపించింది.