Formula E Race : ‘ఫార్ములా-ఈ’ కార్ల రేస్‌ రద్దు.. తెలంగాణ సర్కారు నిరాసక్తి

Formula E Race : ఫిబ్రవరి 10న హైదరాబాద్‌ వేదికగా జరగాల్సి ఉన్న ఫార్ములా-ఈ కార్ల రేస్‌ రద్దయింది.

  • Written By:
  • Publish Date - January 6, 2024 / 11:18 AM IST

Formula E Race : ఫిబ్రవరి 10న హైదరాబాద్‌ వేదికగా జరగాల్సి ఉన్న ఫార్ములా-ఈ కార్ల రేస్‌ రద్దయింది. ఈవిషయాన్ని ట్విట్టర్ వేదికగా ఎఫ్‌ఐఏ ప్రకటించింది. తెలంగాణలో ఏర్పడిన కొత్త సర్కారు నుంచి స్పందన రాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి గతంలో కుదిరిన ఒప్పంద ఉల్లంఘనపై తెలంగాణ మున్సిపల్‌ శాఖకు నోటీసు ఇస్తామని తెలిపింది. అదే తేదీన హైదరాబాద్‌కు బదులుగా మెక్సికో సిటీ హాంకుక్‌లో ఈ రేస్ నిర్వహించనున్నట్లు  తెలిపింది. జ‌న‌వ‌రి 13 నుంచి సీజ‌న్ 10 రేస్‌లు జ‌ర‌గ‌నున్న న‌గ‌రాల్లో టోక్యో, షాంఘై, బెర్లిన్‌, మొనాకో, లండ‌న్ ఉన్నాయి. మెక్సికోలోని హాంకూక్ లో ఫిబ్రవరి 10న తొలి రేస్ జ‌ర‌గ‌నుంది. తెలంగాణ కొత్త సర్కారు నిర్ణయంతో భాగ్యనగరంలో మరోసారి కారు రేసింగ్‌ పోటీలను వీక్షించాలనుకున్న ఫ్యాన్స్‌కు నిరాశే ఎదురైంది. గతేడాది ఫిబ్రవరిలో ఫార్ములా ఈ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్ పోటీలు ట్యాంక్ బండ్ వద్ద జరిగిన సంగతి తెలిసిందే. ఇందుకోసం హైదరాబాద్‌లోని పలు రోడ్లను ప్రత్యేకంగా డెవలప్ చేశారు. ప్రేక్షకులు వీక్షించేందుకు గ్యాలరీలను సైతం ఆనాడు అందుబాటులోకి తెచ్చారు. ఎంతోమంది నగరవాసులు ఫార్ములా-ఈ కార్ల రేసును(Formula E Race) చూసి ఎంజాయ్ చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఫార్ములా ఈ సంస్థ ‘ఈ ప్రిక్స్‌’, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ల మధ్య 2023 అక్టోబర్ 30న రేసింగ్‌కు సంబంధించిన ఒప్పందం కుదిరింది. ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో ఆ ఎగ్రిమెంట్‌ రద్దు అయినట్లు సమాచారం. హోస్ట్ సిటీ అగ్రిమెంట్ చ‌ట్టాల ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకోనున్న‌ట్లు ఎఫ్‌ఐఏ తెలిపింది. తెలంగాణ స‌ర్కారు తీసుకున్న తాజా నిర్ణ‌యం త‌మ‌ను నిరాశ‌ప‌రిచిందని ఫార్ములా ఈ చీఫ్ చాంపియ‌న్‌షిప్ ఆఫీస‌ర్ ఆల్బ‌ర్టో లాంగో తెలిపారు. భార‌త్‌లో మోట‌ర్‌స్పోర్ట్స్ అభిమానుల‌ను తీవ్ర నిరాశ‌కు గురిచేసిన‌ట్లు చెప్పారు. వ‌ర‌ల్డ్ చాంపియ‌న్‌షిప్ రేస్ ఈవెంట్‌ను హైద‌రాబాద్ నిర్వ‌హించ‌డం కీల‌క‌మైంద‌ని, కానీ దుర‌దృష్ట‌వ‌శాత్తు తెలంగాణలో ఏర్ప‌డ్డ కొత్త‌ స‌ర్కార్ నిర్ణ‌యం వ‌ల్ల ఆ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌లేక‌పోతున్న‌ట్లు ఆల్బ‌ర్టో తెలిపారు. గ‌త ఏడాది జ‌రిగిన ప్రారంభోత్స‌వ రేస్ చాలా స‌క్సెస్ అయ్యింద‌ని, ఆ రేస్ వ‌ల్ల ఆ ప్రాంతంలో సుమారు 84 మిలియ‌న్ల డాల‌ర్ల ఆర్థిక ప్ర‌గ‌తి జ‌రిగింద‌ని ఫార్ములా ఈ సీఈవో జెఫ్ డోడ్స్ తెలిపారు. భార‌తీయ భాగ‌స్వాములు మ‌హేంద్ర‌, టాటా క‌మ్యూనికేష‌న్స్ సంస్థ‌ల‌ను అసంతృప్తికి గురి చేసిన‌ట్లు అయింద‌న్నారు.

Also Read: Sankranti Special Buses : సంక్రాంతికి స్పెషల్ బస్సులు.. ఏపీఎస్‌ఆర్టీసీ 6,795.. టీఎస్ఆర్టీసీ 4,484