Formula E – 55 Crores : ఫార్ములా ఈ-రేసింగ్ కేసు.. 55 కోట్ల లెక్క తేల్చనున్న రేవంత్ సర్కారు!

Formula E - 55 Crores : ఫార్ములా  ఈ - రేసింగ్’ వ్యవహారం త్వరలో అనూహ్య మలుపు తిరుగుతుందనే ప్రచారం జరుగుతోంది.

  • Written By:
  • Publish Date - February 10, 2024 / 12:54 PM IST

Formula E – 55 Crores : ఫార్ములా  ఈ – రేసింగ్’ వ్యవహారం త్వరలో అనూహ్య మలుపు తిరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌కు చెందిన ఓ  కీలక నేతకు అది సమస్యగా మారుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.  ఎలాంటి అనుమతులు లేకుండా ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి రూ. 55 కోట్లను అప్పట్లో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖను చూసిన ఐఏఎస్ అర్వింద్ కుమార్ మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం ఆ ప్రాసెస్‌ను చేపట్టలేదు. కనీసం రాష్ట్ర క్యాబినెట్ అనుమతి కూడా తీసుకోలేదు. దీనిపై అర్వింద్ కుమార్‌ను రేవంత్ సర్కార్ వివరణ కోరారు. తెలంగాణ సీఎస్ షోకాజ్ నోటీసు జారీ చేశారు.

వివరణలో ఏముంది ?

దీంతో వివరణ ఇచ్చిన ఐఏఎస్ అర్వింద్ కుమార్..  ‘‘ఫార్ములా ఈ-రేసింగ్‌ వ్యవహారంలో అప్పటి మంత్రి కేటీఆర్ హెచ్‌ఎండీఏ నుంచి డబ్బులు చెల్లించమని చెప్తేనే ఇచ్చాం’’ అని ప్రభుత్వానికి ఆన్సర్ ఇచ్చారు. ఈ విషయాన్ని ఆర్థిక శాఖకు తెలియజేయకుండానే..  మంత్రి కేటీఆర్ మౌఖిక ఆదేశంతో రూ. 55 కోట్లను(Formula E – 55 Crores) ఫార్ములా ఈ రేసింగ్ కంపెనీకి ఇచ్చామని ఆయన అన్నారు. దీంతో ఫార్ములా ఈ రేసింగ్ వ్యవహారం బీఆర్ఎస్ గత సర్కారులోని పలువురు పెద్దలకు చుట్టుకోవచ్చనే సంకేతాలు వెలువడ్డాయి. గతంలో బీఆర్ఎస్ పెద్దలకు అత్యంత సన్నిహితంగా వ్యవహరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమారే.. ఇప్పుడు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఆనాటి ఓ వ్యవహారాన్ని బయటపెట్టడాన్ని పరిశీలకులు కీలక మలుపుగా అభివర్ణిస్తున్నారు. ఈనేపథ్యంలోనే కాంగ్రెస్‌ ప్రభుత్వం ‘ఫార్ములా ఈ-రేసింగ్‌’ను రద్దు చేసింది.

We’re now on WhatsApp. Click to Join

ఫార్ములా ఈ రేస్‌ వ్యవహారంలో కదలిక.. 

  • ఫార్ములా ఈ రేస్‌కు సంబంధించి నాలుగు సీజన్ల కోసం 2023 అక్టోబరు 22న ఏస్‌ నెక్ట్స్‌ జెన్‌, ఫార్ములా-ఈ కంపెనీ, ప్రభుత్వానికి మధ్య ఒప్పందం జరిగింది. ప్రభుత్వం తరపున హెచ్‌ఎండీఏ  రూ. 20 కోట్లు పెట్టి ట్రాక్‌ వేసింది. హైదరాబాద్‌ రేసింగ్‌ లిమిటెడ్‌ రూ. 35 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత త్రైపాక్షిక ఒప్పందాన్ని మార్చుకున్నారు. స్పాన్సర్‌ షిప్‌ ఇస్తామని చెప్పిన గ్రీన్‌ కో కంపెనీ వైదొలిగింది. దీంతో ఖర్చంతా తెలంగాణ సర్కారుపైనే పడింది.
  • ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చాక ఫార్ములా-ఈ కంపెనీకి అప్పటి పురపాలక, పట్టణాభివద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ 55 కోట్లు చెల్లించారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ సదరు కంపెనీని వివరణ కోరగా, ప్రభుత్వమే మరో రూ.55 కోట్లను కట్టాలంటూ ఆ కంపెనీ ప్రభుత్వానికి నోటీసు ఇచ్చింది. లేకుంటే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
  • దీనిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.   దీనికి సంబంధించి అర్వింద్‌కుమార్‌ ప్రభుత్వానికి సుదీర్ఘ వివరణే ఇచ్చారు. దానిలో మంత్రి హౌదాలో కేటీఆర్‌ ఇచ్చిన మౌఖిక ఆదేశాల మేరకే డబ్బు చెల్లింపులు చేశామని చెప్పుకొచ్చారు.
  • ఈ వ్యవహారంతో సంబంధమున్న వారు అక్రమాలకు, అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆధారాలు లభించిన తర్వాత..  వారిపై కేసులు నమోదు చేయాలని రేవంత్ సర్కారు భావిస్తోందని తెలుస్తోంది. వారి నుంచి డబ్బులు రికవరీ చేయించాలని యోచిస్తోందని సమాచారం.

Also Read : Largest Land Owner : మన దేశంలో ప్రభుత్వం తర్వాత అతిపెద్ద ల్యాండ్ ఓనర్.. ఎవరు ?