Formula e -car Race : ఫార్ములా-ఈ కారు రేసు కేసు దర్యాప్తులో భాగంగా ఈరోజు ఏసీబీ అధికారుల ఎదుట ఏస్‌నెక్ట్స్‌జెన్, గ్రీన్‌కో ప్రతినిధులు విచారణకు హాజరుకానున్నారు. ఫార్ములా ఈ రేసు నిర్వహణకు సంబంధించిన ఒప్పందాలు ఫార్ములా ఈ-ఆపరేషన్ లిమిటెడ్ (ఎఫ్‌ఈఓ), ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రైవేటు లిమిటెడ్, పట్టణాభివృద్ధిశాఖ మధ్య జరిగాయి. ఇందులో సీజన్ 9కి ఏస్‌నెక్ట్స్‌జెన్ స్పాన్సర్‌గా వ్యవహరించింది. ఏస్‌నెక్ట్స్‌జెన్ సంస్థకు మాతృ సంస్థ అయిన గ్రీన్‌కో నుంచి బీఆర్‌ఎస్ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కొన్ని లావాదేవీలు వచ్చాయని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు.
ఏస్ నెక్ట్స్‌జెన్ ప్రమోటర్‌గా ఉంటూ 9, 10, 11, 12 సెషన్లకు సంబంధించిన ఫీజును ఎఫ్‌ఈవోకు చెల్లిస్తోంది. వాస్తవానికి ప్రమోటర్ పాత్రలో తెరపైకి వచ్చిన ఏస్ నెక్ట్స్‌జెన్, దీని సిస్టర్ కంపెనీ ఏస్ రేస్‌కు స్పోర్టింగ్‌లో ఎలాంటి అనుభవం లేదు. ఈ కంపెనీలన్నింటిలో చలమలశెట్టి అనిల్‌కుమార్ కీలక హోదాల్లో ఉన్నారు. బ్రిటన్‌కు చెందిన ఎఫ్‌ఈవోతో మాజీ మంత్రి కేటీఆర్ తొలి దఫా చర్చలు జరిపిన తర్వాత హఠాత్తుగా ఏస్ నెక్ట్స్‌జెన్, ఏస్ రేస్ కంపెనీలను 2022 జూలైలో రిజిస్ట్రేషన్ చేయించారు.
కాగా, ఈ ఫార్ములా e-కార్ రేస్ కేసులో ఇప్పటికే బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు హెచ్‌ఎండీఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్, హెచ్‌ఎండీఏ ఇంజినీర్ ఇన్ చీఫ్ బీఎల్ఎన్ రెడ్డిలను ఏసీబీ అధికారులు విచారించారు. దీంతో ఫార్ములా ఈ కేసు దర్యాప్తులో ఏసీబీ వేగం పెంచిందని… పలువురు చుట్టూ ఉచ్చు బిగిసే ఛాన్స్ ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. ఇక, హైదరాబాద్ వేదికగా 4 సెషన్లలో ఫార్ములా-ఈ కారు రేసు నిర్వహించడం కోసం పురపాలకశాఖ, ఫార్ములా-ఈ ఆపరేషన్స్ (ఎఫ్‌ఈవో), ఏస్ నెక్ట్స్‌జెన్ మధ్య 2022 అక్టోబరు 25న త్రైపాక్షిక ఒప్పందం జరిగింది.