ACB Raids : ఫార్ములా ఈ కార్ రేసు కేసులో తెలంగాణ ఏసీబీ(ACB Raids) దూకుడు పెంచింది. ఈ కేసుతో సంబంధమున్న గ్రీన్ కో కంపెనీకి హైదరాబాద్, విజయవాడ నగరాల్లో ఉన్న ఆఫీసుల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో ఉన్న గ్రీన్‌కో కార్యాలయంలో ఇవాళ ఉదయం నుంచి రైడ్స్ కొనసాగుతున్నాయి. గ్రీన్‌కో అనుబంధ సంస్థ ‘ఏస్ నెక్ట్స్ జెన్’లో కూడా తనిఖీలు జరుగుతున్నాయి. ఈ కేసుతో ముడిపడిన కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. కేటీఆర్‌ను అరెస్ట్ చేయవద్దంటూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు ఇటీవలే రద్దయిన నేపథ్యంలో ఏసీబీ రైడ్స్‌ను వేగవంతం చేసింది.
Also Read :Telugu Federation Conference : తెలుగు మహాసభల పై ఎంపీ చామల ఆగ్రహం
బీఆర్ఎస్‌కు రూ.41 కోట్ల విరాళాల చిట్టా విప్పేందుకు..
ఫార్ములా ఈ కార్ రేసు వ్యవహారంతో సంబంధమున్న గ్రీన్‌కో అనుబంధ కంపెనీల నుంచి బీఆర్ఎస్ పార్టీకి రూ.41 కోట్ల విరాళాలు ఎన్నికల బాండ్ల ద్వారా వచ్చాయని అంటున్నారు. ఇప్పుడు దీనితో ముడిపడిన సమాచారాన్ని సేకరించడంపై తెలంగాణ ఏసీబీ ఫోకస్ పెట్టిందని తెలిసింది. 2022 అక్టోబరు 25న ఫార్ములా ఈ కార్ రేసు నిర్వహణకు సంబంధించి త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అయితే దాని కంటే ముందే (2022 సంవత్సరం ఏప్రిల్‌లో) రూ.31 కోట్లు, అక్టోబరు నెలలో మరో రూ.10 కోట్ల విరాళాలు గ్రీన్‌కో అనుబంధ సంస్థల నుంచి బీఆర్ఎస్‌కు అందాయని చెబుతున్నారు. ఈ అంశాలను ధ్రువీకరించే డాక్యుమెంట్ల సేకరణపై ఏసీబీ ఫోకస్ పెట్టింది.
Also Read :Yashasvi Jaiswal: వన్డేల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ ప్లేయర్.. ఎలా రాణిస్తాడో?
ఆ తర్వాతే కేటీఆర్ అరెస్టు ?
కీలక ఆధారాలను సేకరించిన వెంటనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌ను ఏసీబీ అరెస్టు చేస్తుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ను ఈనెల 9న తెలంగాన ఏసీబీ విచారించనుంది. దీనిపై ఇప్పటికే ఆయనకు నోటీసులకు పంపింది. అయితే ఆరోజున అరెస్ట్ చేయకపోవచ్చని, విచారణ ముగిసిన తర్వాత అరెస్ట్ చేస్తారని పలువురు న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ తరుణంలో అరెస్టు నుంచి తనకు రక్షణ కోరుతూ సుప్రీంకోర్టును కేటీఆర్ ఆశ్రయిస్తారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.ఈ కేసులో కీలకంగా మారిన అరవింద్ కుమార్, బీఎల్ఎన్ రెడ్డిలను కూడా ఈడీ విచారించనుంది.