ఖమ్మం జిల్లా (Khammam District) వైరా ( Wyra ) నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే బానోతు మదన్ లాల్ (Banoth Madanlal) (62) గుండెపోటుతో కన్నుమూశారు. తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలడంతో కుటుంబసభ్యులు వెంటనే హైదరాబాదులోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతుండగానే ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటనపై కుటుంబ సభ్యులు, బంధువులు, ప్రజాప్రతినిధులు తీవ్ర విషాదాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మదన్ లాల్ 2014లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం రాజకీయ మార్పుల నేపథ్యంలో బీఆర్ఎస్ (ఆప్పటికీ టీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఆయన 2018 మరియు 2023 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయారు. అయితే రాజకీయంగా ఇంకా చురుకుగా ఉన్న మదన్ లాల్, ఇటీవల వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
Mahanadu : కార్యకర్తే అధినేతగా మారాలి..అదే నా ఆశ..ఆకాంక్ష: సీఎం చంద్రబాబు
1963 మే 3న రఘునాథపాలెం మండలంలోని ఈర్లపూడి గ్రామంలో జన్మించిన మదన్ లాల్, ఉస్మానియా యూనివర్శిటీలో BA చదివారు. 2009లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ సీపీఐ నేత చంద్రావతి చేతిలో ఓడిపోయారు. 2012లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత, 2014లో ఎమ్మెల్యేగా విజయం సాధించారు. రాజకీయాల్లో ఆయనకి మంచి ప్రజాదరణ ఉండేది.
మదన్ లాల్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ, కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు. అలాగే బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు కూడా మదన్ లాల్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సంఘటన రాష్ట్ర రాజకీయాల్లో విషాదాన్ని మిగిల్చింది.