Boora Narsaiah Vs Rajagopal Reddy : కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడో రేపో బీజేపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్‌లో చేరుతారనే టాక్ వినిపిస్తోంది. ఈమేరకు ప్రచారం జరుగుతున్న తరుణంలో బీజేపీ అలర్ట్ అయింది. మునుగోడు అసెంబ్లీ బరిలోకి దింపేందుకు బలమైన అభ్యర్థి ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. ఈక్రమంలోనే ఒక ముఖ్య నాయకుడి పేరు తెరపైకి వచ్చింది. ఆయనే బీసీ వర్గంలో మంచిపేరున్న నేత బూర నర్సయ్యగౌడ్. బీసీలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్న బీజేపీ.. మునుగోడు నుంచి బూర నర్సయ్యకు ఛాన్స్ ఇవ్వాలని (Boora Narsaiah Vs Rajagopal Reddy) భావిస్తోందట.
మునుగోడులో బీసీలే ఎక్కువ.. అందుకే ..
మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో బీసీ జనాభా చాలా ఎక్కువ. ఈ నియోజకవర్గంలో గౌడ ఓటర్లు అత్యధికంగా 35,150 మంది ఉన్నారు. నియోజకవర్గం మొత్తం ఓటర్లలో వీరు 15.94 శాతానికి సమానం. ముదిరాజు ఓటర్లు 33, 900 మంది, యాదవ ఓటర్లు 21, 360 మంది, పద్మశాలీ ఓటర్లు 11, 680 మంది, వడ్డెర ఓటర్లు 8,350 మంది, కుమ్మరి ఓటర్లు 7,850 మంది, విశ్వబ్రాహ్మణ ఓటర్లు 7,820 మంది, మున్నూరు కాపు ఓటర్లు 2,350 మంది ఉన్నారు. ఈనేపథ్యంలో బీసీ వర్గానికి చెందిన.. ప్రత్యేకించి మునుగోడులో అతిపెద్ద ఓటుబ్యాంకు కలిగిన గౌడ వర్గానికి చెందిన బూర నర్సయ్యగౌడ్‌కు అవకాశం ఇస్తే కలిసి వస్తుందని బీజేపీ ఆశిస్తోంది.
బూర నర్సయ్య గౌడ్ ఆలోచన ఇంకోలా..
ఇదేకాక.. 2014 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి స్థానంలో బీఆర్ఎస్ తరఫున పోటీచేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించిన ట్రాక్ రికార్డు కూడా బూర నర్సయ్య గౌడ్‌కు ఉంది. మరోవైపు బూర నర్సయ్య గౌడ్ ఆలోచన ఇంకోలా ఉందని తెలుస్తోంది. ఆయన ఇప్పుడు మునుగోడు అసెంబ్లీకి పోటీ చేయడానికి రెడీగా లేరని అంటున్నారు. ఒకవేళ అసెంబ్లీకే పోటీ చేయాలనుకున్నా ఆయన ఫస్ట్ ప్రయారిటీ ఇబ్రహీంపట్నం అని తెలుస్తోంది. అయితే ఆ టికెట్‌ను ఇప్పటికే నోముల దయానంద్ గౌడ్‌కు బీజేపీ కేటాయించింది. దీంతో బూర ఇక భువనగిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయాలని బూర భావిస్తున్నారట. కానీ రాజగోపాల్ రెడ్డి బీజేపీని వీడుతున్న ప్రస్తుత తరుణంలో.. మునుగోడు బరిలోకి దిగానలి కమలదళం హైకమాండ్ బూరను కోరే అవకాశం ఉందని సమాచారం.
We’re now on WhatsApp. Click to Join.
రేపు కాంగ్రెస్‌లోకి రాజగోపాల్ రెడ్డి ?
ఈ నెల 25న రాహుల్ గాంధీ సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మేరకు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైందే కాంగ్రెస్ నుంచి. మధ్యలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైనా.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనంగా మారారు. రాజగోపాల్ రెడ్డి 2009 లోక్ సభ ఎన్నికల్లో భువనగిరి నుంచి ఎంపీగా విజయం సాధించినా.. 2014లో మాత్రం ఓటమి పాలయ్యారు. 2018 శాసన సభ ఎన్నికల్లో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా విజయం సాధించారు.