Tummala Comments: తుమ్మల వ్యాఖ్యల కలకలం

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి.

Published By: HashtagU Telugu Desk
Tummala

Tummala

తెలంగాణ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి రాజీనామా వ్యవహరం, మంత్రి ఎర్రబెల్లి సోదరుడు ప్రదీప్ రావు పార్టీ మార్పు అంశాలు చర్చనీయాంశమవుతున్నాయి. తాజాగా టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తున్నాయి. ఖమ్మంలో తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడం ఖాయంగా కనిపిస్తోంది. పాలేరులో కార్యకర్తలు.. అనుచరులతో సమవేశమైన తుమ్మల.. ఏ క్షణమైన పిడుగులాంటి వార్త వినాల్సి వస్తోంది.. కార్యకర్తలు సిద్దంగా ఉండాలని పిలుపునిచ్చారు.

పాలేరు నుంచి వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్దంగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అవసరమైతే పార్టీ మారి అక్కడ నుంచి తప్పనిసరిగా పోటీ చేయాలని దృక్పథంతో ఉన్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్‌లోకి పదవులు ఆశ చూపి తెచ్చుకున్న సీనియర్లు ఇప్పుడు ఆదరణ లేక ఆదే రేంజ్‌లో షాకిచ్చి బయటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. గతంలో ఖమ్మం ఉమ్మడి జిల్లా పాలేరు నుంచి తుమ్మల పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అక్కడ గెలిచిన ఉపేందర్ రెడ్డి టీఆర్ఎస్ లో నిలిచి మళ్లీ పాలేరు బరిలో నిలిచేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో తుమ్మలకు అటు ఎమ్మెల్యేగా, ఇటు ఎంపీగా పోటీ చేసే అవకాశాలు నామమాత్రంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తుమ్మల నాగేశ్వర్ రావు పార్టీ మారవచ్చునని ఆయన వర్గీయులు భావిస్తున్నారు. అయితే ముందస్తు ఎన్నికల నేపథ్యంలో కార్యకర్తలను సిద్దంచేసేందుకు ఈ వ్యాఖ్యలు చేశారా.. పార్టీ మార్పు గురించి చేశారా? అనేది స్పష్టత రావాల్సి ఉంది.

  Last Updated: 03 Aug 2022, 05:56 PM IST