Mallareddy : బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి ఇవాళ హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తన మనవరాలి పెళ్లికి రావాలంటూ కిషన్ రెడ్డికి ఆయన ఆహ్వాన లేఖను అందజేశారు. మల్లారెడ్డి వెంట ఆయన అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నారు. ఈసందర్భంగా కిషన్ రెడ్డిని ‘నమస్తే అన్న’ అంటూ మల్లారెడ్డి (Mallareddy) పలకరించారు. దీంతో ‘స్వాగతం’ అని కిషన్ రెడ్డి బదులిచ్చారు. దీనికి మల్లారెడ్డి రియాక్ట్ అవుతూ.. ‘‘సగం సగం చెప్తావేంటన్నా’’ అని పేర్కొన్నారు. ‘‘స్వాగతానికి మించి ఏం చెప్పమంటారో మీరే చెప్పండి’’ అని కిషన్ రెడ్డి చెప్పారు.
Also Read :Crorepati MLAs : 90 మంది ఎమ్మెల్యేల్లో 86 మంది కోటీశ్వరులే.. సగటు ఆస్తి పాతిక కోట్లు
అనంతరం కిషన్ రెడ్డి, మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి కూర్చొని కాసేపు మాట్లాడుకున్నారు. ఈసందర్భంగా మీడియాతో మల్లారెడ్డి మాట్లాడుతూ.. ‘‘కిషన్ రెడ్డి చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. 30 ఏళ్లుగా నాకు పరిచయం. ఆయన నా దోస్తు. అందుకే నా మనవరాలి పెళ్లికి పిలుస్తున్నాను. మేం పొలిటికల్ విషయాలేం మాట్లాడలేదు. మీకు అస్తమానం అవే ముచ్చట్లు కావాలా? ’’ అని పేర్కొన్నారు. ‘‘చంద్రబాబు నాకు రాజకీయ భిక్ష పెట్టాడు. ఆయన దయవల్ల ఎంపీ అయ్యాను. బీజేపీ, టీడీపీ పొత్తు వల్ల ఆనాడు పార్లమెంట్‌కు వెళ్లగలిగాను’’ అని మల్లారెడ్డి గుర్తు చేసుకున్నారు. మొత్తం మీద మల్లారెడ్డి అకస్మాత్తుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లడంతో అంతా షాక్‌కు గురయ్యారు. చివరకు ఆయన వెళ్లింది ఎందుకో తెలుసుకొని కూల్ అయ్యారు. మనవరాలి మ్యారేజ్‌కు కిషన్ రెడ్డిని మల్లారెడ్డి ఆహ్వానించారని స్పష్టమైంది.