TRS vs BJP: టీఆర్ఎస్‌కు జ‌బ‌ర్థ‌స్త్ షాక్.. బీజేపీలో చేర‌నున్న మాజీ మంత్రి జూప‌ల్లి..?

  • Written By:
  • Publish Date - March 11, 2022 / 12:49 PM IST

తెలంగాణ‌లో టీఆర్‌ఎస్ నేతల్లో అసహనం పెరుగుతోందా అంటే అవుననే అంటున్నారు గులాబీ పార్టీ శ్రేణులు. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్‌లో ఉన్న అసంతృప్త నేత‌లంతా ఇత‌ర పార్ట‌ల్లో చేరేందుకు సిద్ధ‌మవుతున్నార‌ని తెలుస్తోంది. ఈ క్ర‌మంలో మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు బీజేపీలో చేర‌నున్నార‌నే వార్త‌లు జోరుగా ప్ర‌చారం అవుతున్నాయి. ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ తెలంగాణ‌లో జెండా పాత‌డానికి విశ్వ‌ప్ర‌య‌త్నం చేస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ నేప‌ధ్యంలో ఇప్ప‌టికే దుబ్బాక‌, హుజూరా బాద్ ఉప ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి అధికార టీఆర్ఎస్ పార్టీకి బీజేపీ దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఉత్త‌ర ప్ర‌దేశ్‌తో పాటు ఉత్త‌రాఖండ్, మ‌ణిపూర్, గోవా రాష్ట్రాల్లో దుమ్మురేపిన బీజేపీ అదే ఊపులో తెలంగాణ‌లో కూడా అధికారంలోకి వ‌చ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తుంది. ఈ క్ర‌మంలో ప‌లువురు కీల‌క నేత‌లు చూపు ఇప్పుడు కాషాయం పార్టీ పై ప‌డింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో జోరుగా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.

ఇదే క్ర‌మంలో ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వ‌ల‌స‌లు పెరిగే చాన్స్ ఉంద‌ని తెలుస్తోంది. ఇప్ప‌టికే టీఆర్ఎస్ అధిష్టానం పై అసంతృప్తిగా ఉన్న మాజీ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మ‌వుతున్నార‌ని సమాచారం. సీఎం కేసీఆర్ మ‌హ‌బూబ్ న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు డుమ్మాకొట్టిన జూప‌ల్లి, అదే రోజు ఖ‌మ్మం జిల్లాలో ప‌ర్య‌టించి, టీఆర్ఎస్ పార్టీ అసంతృప్త నేత‌లు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మరో టీఆర్ఎస్ నేత పిడమర్తి రవితో భేటీ అవ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ఖ‌మ్మంలో మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు, మాజీ ఎంపీ పొగులేటి శ్రీనివాస‌రెడ్డి, పిడ‌మ‌ర్తి ర‌విల‌తో భేటీ అయిన త‌ర్వాత జూప‌ల్లి కృష్ణారావు కొల్హాపూర్ నియోజకవర్గంలో మండలాల వారీగా వరస సమావేశాలు నిర్వహిస్తూ, అక్క‌డి కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో టీఆర్ఎస్ పార్టీలో త‌న‌కు భ‌విష్య‌త్తు లేద‌ని జూప‌ల్లి భావిస్తున్నారు. దీంతో ఇప్పుడే రాజ‌కీయంగా నిర్ణ‌యం తీసుకోవాల‌ని జూప‌ల్లి కృష్ణారావు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న బీజేపీలో చేరే అవ‌కాశాలు ఉన్నాయ‌ని జూప‌ల్లి అనుచరులు చెబుతున్నారు. రాష్ట్రంలో ఎన్నిక‌ల‌కు త‌క్కువ స‌మ‌య‌మే ఉండ‌డంతో జూప‌ల్లి కృష్ణారావు ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో చూడాలి. ఏది ఏమైనా జూప‌ల్లి బీజేపీలోచేరితే, టీఆర్ఎస్‌కు పెద్ద షాకే అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.