Harish Rao: తెలంగాణలో నెలకొన్న యూరియా కొరత, వరదలపై అసెంబ్లీలో చర్చ చేపట్టాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం అందుకు బదులుగా ‘బురద రాజకీయాలకు’ ప్రాధాన్యత ఇచ్చిందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి, రాజకీయ కక్ష సాధింపు చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన ఆరోపించారు. ఆదివారం హడావుడిగా సభను నిర్వహించి, అసంపూర్తిగా ముగించడం ప్రభుత్వ తీరుకు నిదర్శనమని అన్నారు.
రైతులకు పెనుశాపంగా మారిన పాలన
హరీశ్ రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల కష్టాలపై చర్చించే సమయం, సామర్థ్యం లేవని, ఈ దిక్కుమాలిన పాలన తెలంగాణ రైతాంగానికి పెనుశాపంగా మారిందని అన్నారు. భారత దేశ చరిత్రలో యూరియా కోసం రైతులు ఇంతగా తిప్పలు పడ్డ పరిస్థితులు ఎప్పుడూ లేవని, కాంగ్రెస్ చేతగాని పాలన వల్ల పంట పొలాల్లో ఉండాల్సిన రైతులు యూరియా కోసం రోడ్ల వెంట బారులు తీరాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ఆధార్ కార్డులు, పాస్‌బుక్కులు పట్టుకొని యూరియా బస్తా కోసం పడిగాపులు కాస్తున్నారని, పండుగలు, పబ్బాలు లేకుండా, వానా, ఎండతో సంబంధం లేకుండా రాత్రి, పగలు క్యూలో నిలబడుతున్నారని ఆయన పేర్కొన్నారు. అలసి సొలసి పడిపోతున్నారని, ఓపిక లేక చెప్పులు, పాస్‌బుక్కులు, ఖాళీ సీసాలు, రాళ్లు పెట్టి రోజుల తరబడి ఎదురుచూస్తున్నారని ఆయన వివరించారు.
Also Read: Heavy Rains: 20 రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు!
పత్తి, వరికి యూరియా అత్యవసరం
పత్తి పూత దశలో, వరి పొట్ట దశలో ఉన్నాయని ఈ సమయంలో యూరియా వేయకపోతే దిగుబడి రావని రైతులు పడుతున్న ఆవేదన హృదయ విదారకంగా ఉందని హరీశ్ రావు అన్నారు. ఇటీవల సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్‌లో జరిగిన సంఘటనను ప్రస్తావిస్తూ, యూరియా సంక్షోభంపై రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. హైవేలెక్కి ధర్నాలు చేస్తున్న రైతన్నల ఆగ్రహ జ్వాలలే దీనికి సాక్ష్యమని ఆయన అన్నారు. ఈ సంక్షోభం రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల వచ్చిందని ఆయన ఆరోపించారు.
కేసీఆర్ పాలనతో పోలిక
కేసీఆర్ పాలనలో సకాలంలో యూరియా సరఫరా జరిగిందని, పాలకులు మారగానే పాలసీలు మారిపోతాయా అని హరీశ్ రావు ప్రశ్నించారు. రైతుల కష్టాలు తీర్చని ప్రభుత్వం వల్ల ఏం లాభమని ఆయన నిలదీశారు. యూరియా సరఫరా విషయంలో కేంద్రం నుంచి తెప్పించుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళిక లేదని ఆయన విమర్శించారు. రెండు నెలలుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, రైతులను మోసం చేసిందని ఆయన ఆరోపించారు.
బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల నిర్లక్ష్యం
తెలంగాణలో 8 మంది బీజేపీ ఎంపీలు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉండి కూడా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని హరీశ్ రావు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు నిందలు వేసుకోవడం తప్ప సమస్య పరిష్కారానికి కృషి చేయడం లేదని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం, అమెరికా పత్తిపై సుంకాన్ని ఎత్తివేయడం వల్ల ఆయిల్ ఫామ్, పత్తి రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని తెలిపారు. ఈ సమస్యలపై ఎంపీలకు ఉలుకు, పలుకు లేదని ఆయన దుయ్యబట్టారు.