హైదరాబాద్ మలక్‌పేట్‌లోని శాలివాహన పార్క్ వద్ద సిపిఐ రాష్ట్ర నాయకుడు చందునాయక్(CPI Leader Chandu Nayak)ను జూలై 15వ తేదీన గుర్తు తెలియని దుండగులు తుపాకీతో కాల్చిచంపిన సంగతి తెలిసిందే. బహిరంగ ప్రదేశంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటనను తెలంగాణ పోలీసులు చాల సీరియస్ గా తీసుకోని విచారణను వేగవంతం చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. వీరిని విచారించిన పోలీసులు కేసులో పలు విషయాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
చందునాయక్ హత్యకు ప్రధాన కారణం మాజీ మావోయిస్టు రాజేష్ తో ఉన్న విభేదాలే అని పోలీసులు గుర్తించారు. కుంట్లూరు వద్ద పేదల కోసం గుడిసెల ఏర్పాటు చేయడంలో చందునాయక్ కీలకంగా వ్యవహరించారు. అదే సమయంలో రాజేష్ కూడా అక్కడ గుడిసెలు నిర్మించడమే కాకుండా, చందాలు వసూలు చేస్తున్నాడని చందునాయక్ గుర్తించి, ఈ విషయాన్ని పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. దీనితో రాజేష్ పై పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు కక్ష పెంచుకున్నారు.
Hydraa : జోరు వానను సైతం లెక్క చేయని హైడ్రా కమిషనర్..నీట మునిగిన ప్రాంతాల్లో పర్యటన
హత్యకు ముందుగా వారం రోజుల పాటు రాజేష్ మరియు అతని సన్నిహితులు రెక్కీ నిర్వహించినట్లు తెలుస్తోంది. చందునాయక్ ఇంటివద్దే హత్య చేయాలని తొలుత యత్నించినా, స్థానికులు ఎక్కువగా ఉండే ప్రాంతం కారణంగా ఆ ప్లాన్ వదిలేశారు. ఆ తర్వాత శాలివాహన పార్క్ వద్ద చందునాయక్ ఉన్న సమయంలో అతన్ని కాల్చి చంపి నిందితులు పరారయ్యారు. ఈ హత్యలో నలుగురు నిందితులు ప్రత్యక్షంగా పాల్గొనగా, మరో ఐదుగురు రెక్కీ, సమాచార వినిమయంలో సహకరించారు.
చందునాయక్ హత్య అనంతరం నిందితులు క్యాబ్‌లో ఉప్పల్ వెళ్లి, అక్కడి నుంచి బస్సులో చౌటుప్పల్ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. క్యాబ్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారించడంతో పాటు నిందితుల కాల్ డేటా, సెల్ టవర్ లొకేషన్ ఆధారంగా మిగిలిన నిందితుల కోసం గాలింపు కొనసాగుతోంది. ప్రస్తుతం కేసు విచారణ కీలక దశలోకి వెళ్ళింది. చందునాయక్ హత్య వెనుక నిగూఢంగా నడిచిన కుట్రను పూర్తి స్థాయిలో ఛేదించేందుకు పోలీసులు విశేషంగా కృషి చేస్తున్నారు.