మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy), మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) లు కాంగ్రెస్ (Congress) పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ (Rahul gandhi), మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) , ప్రియాంక గాంధీలతో పొంగులేటి, జూపల్లి తమ అనుచరగణంతో భేటీ అయ్యారు. అనంతరం వారు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇరువురు నేతలు బయటకు వచ్చిన తరువాత ఏ పార్టీలో చేరుతారనే అంశంపై గత మూడ్నెళ్లుగా తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతూ వచ్చింది. ఒకరోజు బీజేపీ, ఒకరోజు కాంగ్రెస్‌లో వారు చేరుతున్నారని ప్రచారం జరిగింది. మరికొన్ని రోజులు వారు కొత్త పార్టీ పెడుతున్నారన్న ప్రచారం జరిగింది. తాజాగా ఈ గందరగోళానికి తెరదించుతూ పొంగులేటి, జూపల్లి ఇద్దరు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
రాహుల్, ప్రియాంకలతో భేటీ అనంతరం పొంగులేటి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. తాము బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చిన తరువాత బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పాటు ప్రాంతీయ పార్టీల నుంచికూడా మాకు ఆహ్వానం వచ్చిందని పొంగులేటి చెప్పారు. అయితే, ఏ పార్టీలో చేరాలనే విషయాన్ని నిర్ణయించుకొనేందుకు అనుచరులతో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తూ వచ్చామని చెప్పారు. శ్రేయోభిలాషుల అభిప్రాయాలను కూడా తీసుకున్నామని తెలిపారు. కొన్నిరోజుల తరువాత సొంతంగా ప్రాంతీయ పార్టీ పెడితే ఎలా ఉంటుందని మాకు ఆలోచన వచ్చిందని పొంగులేటి తెలిపారు. ప్రాంతీయ పార్టీ ఏర్పాటు అంశంపై దాదాపు నెలరోజులు దృష్టిపెట్టామని అన్నారు.
ప్రాంతీయ పార్టీ పెడితే పరిస్థితి ఏమిటి, ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు అని తమ అనుచరులు, శ్రేయోభిలాషులతో పాటు పలు పార్టీల నేతల అభిప్రాయాలను తీసుకున్నామని పొంగులేటి చెప్పారు. ప్రాంతీయ పార్టీ పెట్టేందుకు దాదాపు రెడీ అయ్యామని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. కానీ, చివరిలో ప్రాంతీయ పార్టీతో ఎన్నికలకు వెళితే ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలుతుందని, అలాంటప్పుడు అది కేసీఆర్ విజయానికి అనుకూలంగానే మారుతుందని భావించామని అన్నారు. దీంతో ప్రాంతీయ పార్టీ ఏర్పాటును విరమించుకొని కాంగ్రెస్ పార్టీలో చేరితే కేసీఆర్ ను గద్దెదించవచ్చునని అనుకున్నామని, దీంతో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు నిర్ణయించుకున్నామని పొంగులేటి అన్నారు. జులై 2న ఖమ్మంలో బహిరంగ సభ వేదికగా రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుందని పొంగులేటి చెప్పారు.