KCR: కేసీఆర్ ను పరామర్శించిన మాజీ గవర్నర్ నరసింహాన్

  • Written By:
  • Updated On - January 7, 2024 / 04:59 PM IST

KCR: బిఆర్ఎస్ అధినేత కె చంద్రశేఖర్ రావు ని తెలంగాణ మాజీ గవర్నర్ ఇ ఎస్ ల్ నరసింహన్ పరామర్శించారు. ఆదివారం మధ్యాహ్నం నందినగర్ చేరుకున్న గవర్నర్ దంపతులు కేసీఆర్ తో మర్యాద పూర్వక భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఆరోగ్యపరిస్థితి వివరాలు తెలుసుకున్నారు.
త్వరలో పూర్తిస్థాయి లో కోలుకోవాలని గవర్నర్ ఆకాంక్షించారు. కాసేపు కేసీఆర్ సతీమణి శోభమ్మ తదితర కుటుంబ సభ్యులతో వారు ఇష్టాగోష్టి జరిపారు.

ఈ సందర్భంగా నందినగర్ నివాసానికి చేరుకున్న నరసింహన్ దంపతులను తొలుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కె. తారకరామారావు సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, బీబీ పాటిల్ తదితరులు పాల్గొన్నారు. నూతన తెలంగాణ రాష్ట్రం లో జరిగిన అభివృద్ధి.. ఈ క్రమంలో గవర్నర్ హోదాలో నాడు నరసింహన్ అందించిన సంపూర్ణ సహకారం చర్చకు వచ్చిన సందర్భంలో, వారి సహకారానికి తెలంగాణ తొలిముఖ్యమంత్రి గా కేసీఆర్ మరోసారి ధన్యవాదాలు తెలిపారు.

తమ నివాసానికి వచ్చిన అతిథులను కేసీఆర్ దంపతులు నిండుమనసుతో సత్కరించారు. వారికి పట్టువస్త్రాలు సమర్పించి సంప్రదాయ పద్దతిలో అతిథి మర్యాదలు చేసారు. కేసీఆర్ దంపతులు చూయించిన ప్రేమాభిమానాలకు వారు అభినందనలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది బీఆర్ఎస్ పార్టీ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేపథ్యంలో… ఈ ఎన్నికలు అతిపెద్ద సవాల్ గా మారాయి. ఓవైపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన జోష్ తో ఉండగా… ఎక్కువ సంఖ్యలో ఎంపీ సీట్లను గెలవాలని చూస్తోంది. ఇదిలా ఉంటే… మెజార్టీ సీట్లపై కన్నేసింది బీజేపీ. రెండు జాతీయ పార్టీలు కూడా బలమైన ప్రత్యర్థులుగా ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నికల కోసం ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళ్లాలని భావిస్తోంది.

అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని భావించింది బీఆర్ఎస్. కానీ ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష పాత్రకు పరిమితమైంది. 39 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అనుకున్న వ్యూహాలు బెడిసికొట్టడంతో… ఫలితాలపై అంచనాలు పూర్తిగా తప్పాయి. ఫలితంగా కేసీఆర్ కు అతిపెద్ద షాక్ తగిలినట్లు అయింది. అయితే ప్రతిపక్షంలో ఉన్నా… ప్రజల తరపున కొట్లాడే పార్టీగా తాము ముందు వరుసలో ఉంటామని చెబుతోంది బీఆర్ఎస్. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలని కోరుతోంది. ఇప్పటికే తెలంగాణ భవన్ వేదికగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి సన్నాహాక సమావేశాలను నిర్వహిస్తోంది బీఆర్ఎస్. ప్రతిరోజూ ఒక పార్లమెంట్ స్థానానికి సంబంధించిన నేతలతో చర్చిస్తోంది.