Site icon HashtagU Telugu

CM KCR : థర్డ్ ఫ్రంట్ దిశగా కేసీఆర్ అడుగులు..?

Kcr

Kcr

థర్డ్ ఫ్రంట్ దిశగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పావులు కదుపుతున్నారా.. కేంద్రంలో ఉన్న బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారా..? అంటే అవుననే అంటున్నాయి ప్రస్తుత రాజకీయాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్, కేరళ సీఎం విజయన్, కమ్యూనిస్టు నేతలతో భేటీ కావడం చర్చనీయాంశమైంది. ప్రాంతీయ పార్టీలు, రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం ఏంటి? అనే అంశాలు చర్చించినట్టుగా పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా బీజేపీ పై బహిరంగ విమర్శలు చేస్తుండటం కూడా హాట్ టాపిక్ గా మారాయి. అయితే కేసీఆర్ ను వరుసగా జాతీయ నేతలు కలుస్తుండటంతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి.

తాజాగా బీహార్ మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు, బీహార్ అసెంబ్లీ ప్రతిపక్ష నేత, ఆర్జేడీ కీలక నేత తేజస్వీ ప్రసాద్ యాదవ్ మంగళవారం ఇక్కడి ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి శ్రీ కే చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ తేజస్వీ యాదవ్‌తో పాటు మాజీ మంత్రి శ్రీ అబ్దుల్ బారీ సిద్ధిఖీ, మాజీ ఎమ్మెల్సీ శ్రీ సునీల్ సింగ్, మాజీ ఎమ్మెల్యే శ్రీ భోళా యాదవ్ ముఖ్యమంత్రిని కలిశారు. ఈ భేటీలో ప్రస్తుత జాతీయ రాజకీయలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది. కాగా గత ఎన్నికల్లో తేజస్వీ యాదవ్ నితీశ్ కుమర్ కు గట్టి పోటీ ఇచ్చిన విషయం తెలిసిందే.