Site icon HashtagU Telugu

Tiger Search: పులి కోసం అడ‌విని జ‌ల్లెడప‌డుతున్న ఫారెస్ట్ సిబ్బంది

Karimnagar5 Imresizer

file photo

కొద్ది రోజుల క్రితం భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు జిల్లాల అటవీ ప్రాంతం నుంచి కొత్తగూడ అటవీ ప్రాంతంలోకి పులి ప్రవేశించినట్లు ఫారెస్ట్ అధికారుల‌కు స‌మాచారం వ‌చ్చింది. ఈ పులిని ప‌ట్టుకునేందుకు అధికారులు తీవ్రంగా శ్ర‌మిస్తున్నారు. సిబ్బంది పులి సంచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. చివరిగా ఆదివారం ఉదయం భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలోని కొత్తగూడ అటవీ ప్రాంతంలో పులి గుర్తులు కనిపించాయి. గూడూరు రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిధిలోని నెలవంచ సమీపంలో శుక్రవారం రాత్రి ఆవును చంపిన పులి అప్పటి నుంచి క‌నిపించ‌డంలేదు. ఇప్పటి వరకు జిల్లాలోని అడ‌వి ఉన్న ప్రాంతాల్లో కెమెరాల ద్వారా పులి సంచారాన్ని నిరంతరం పర్యవేక్షిస్తూ నిఘా పెంచినప్పటికీ పులి ఆచూకీ లభించలేదని అటవీ శాఖ వర్గాలు తెలిపాయి. పులి స్థానికంగా ఉన్న అడవుల్లోకి వెళ్లి ఉండవచ్చని లేదా పొరుగు జిల్లాల్లోని అడవుల్లోకి వెళ్లి ఉండవచ్చని అధికార‌ వర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా గూడూరు, పరిసర మండలాల్లోని పశువులను మేపేవారిని అటవీ ప్రాంతాల్లోకి రాకుండా నిరోధించాలని అట‌వీ శాఖ అధికారులు పంచాయతీ రాజ్ అధికారుల‌కు తెలిపారు. అంతుచిక్కని పులి సంచారాన్ని గుర్తించేందుకు నిఘాను ముమ్మరం చేస్తున్నారు.