Tiger : అదిగో పులి.. ఇదిగో ప్రత్యేక బృందాలు!

గత కొన్ని రోజులుగా భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి, యెల్లందు మండలాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సంచరిస్తున్న అంతుచిక్కని పులి సంచారంపై నిఘా పెంచేందుకు

  • Written By:
  • Publish Date - November 22, 2021 / 04:14 PM IST

గత కొన్ని రోజులుగా భదాద్రి కొత్తగూడెం జిల్లాలోని టేకులపల్లి, యెల్లందు మండలాల్లోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతంలో సంచరిస్తున్న అంతుచిక్కని పులి సంచారంపై నిఘా పెంచేందుకు యెల్లందు మండలం దండ గుండాల అటవీ ప్రాంతంలో అటవీశాఖ అధికారులు నిఘా పెంచారు. ఆదివారం సాయంత్రం టేకులపల్లి మండలం అందుగులగూడెం గ్రామం వద్ద రోడ్డు దాటుతున్న పులి చిత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో యెల్లందు మండలం దండ గుండాల, కొమురారం అటవీ ప్రాంతాల్లో అటవీ దళారులు నిఘా పెట్టినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ పులి వారం రోజుల క్రితం పొరుగున ఉన్న ములుగు జిల్లా నుంచి జిల్లాలోకి ప్రవేశించిందని, అప్పటి నుంచి ఏదుళ్ల బయ్యారం, టేకులపల్లి మండలాల్లోని అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోందని భావిస్తున్నారు.

పులి సంచారాన్ని గుర్తించేందుకు అటవీ శాఖ ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపింది. అటవీ వాసులతో పాటు పులిని కూడా కాపాడేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అటవీ అంచుల వెంబడి ఉన్న ఆవాసాలలో పశువులను మేపుకునే వారికి అవగాహన కల్పించింది. అయితే గతకొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో పులులు జనా వాసాల మధ్య సంచారం చేయటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొద్ది నెలల క్రితం హైదరాబాద్ శివారు మైలార్ దేవ్ పల్లి, బుద్వేల్, కాటేదాన్ పరిసరాల్లో చిరుత పులి సంచారం ప్రజలను భయభ్రాంతులకు గురిచేసింది. తాజాగా రాష్ట్రంలోని రెండు జిల్లాలో పులుల సంచారం స్ధానిక ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అడవుల్లో అలజడి రేపిన పులి సంచారం, గ్రామీణ ప్రాంత ప్రజలను నిద్రపోనివ్వటం లేదు. దిగిడలో ఒక యువకుడిని హత మార్చిన పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ అధికారులు 35 మంది సిబ్బందితో 7 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలను అమర్చి పులి ఆనవాళ్లను గుర్తించేందుకు యత్నిస్తున్నారు. తెలంగాణలోని పలు అడవుల్లో పులుల సంఖ్య పెరిగిందని, అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని రక్షణ చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ప్రత్యేక నిఘా లేకపోవడంతో పులులు వేటగాళ్ల చేతికి చిక్కే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పులులను లెక్కించేందుకు, పెరుగుతున్న పులుల గణనపై అవగాహన లోపించిందని, ఇప్పటికైనా అటవీ శాఖాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా ప్రాంతాల ప్రజలు కోరుతున్నారు.