Floods In Telangana : తెలంగాణలో మళ్లీ వరదలు.. అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం

తెలంగాణలో రెండు వారాల వ్యవధిలో రెండోసారి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో వాగులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి

  • Written By:
  • Updated On - July 24, 2022 / 10:01 AM IST

తెలంగాణలో రెండు వారాల వ్యవధిలో రెండోసారి భారీ వ‌ర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో వాగులు, రిజర్వాయర్లు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌తో పాటు మరికొన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమైయ్యాఇ. దీంతో ప‌లు ప్రాంతాల‌కు ర‌వాణా సౌక‌ర్యం నిలిచిపోయి జనజీవనం స్తంభించిపోయింది. వర్షాల కారణంగా ముగ్గురు వ్యక్తులు మృతి చెందగా, ఒకరు గల్లంతయ్యారు. వరంగల్ పట్టణంలో శనివారం తెల్లవారుజామున భవనం కూలిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మెదక్ జిల్లా ముంపు ప్రాంతంలో రోడ్డు డివైడర్‌ను ఢీకొని మోటార్‌బైక్‌పై వెళ్తున్న వ్యక్తి మృతి చెందాడు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల రోడ్లు, వంతెనలు నీటమునిగి దెబ్బతిన్నాయి, వాగులు, సరస్సులు, రిజర్వాయర్లు ఉప్పొంగుతున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు గ్రేటర్‌ హైదరాబాద్‌, మెదక్‌, జనగాం, మహబూబాబాద్‌, సంగారెడ్డి జిల్లాల్లో రోడ్లు చెరువులుగా మారాయి. హైదరాబాద్‌-నాగ్‌పూర్‌, మెదక్‌-హైదరాబాద్‌ హైవేలతో సహా కొన్ని కీలక రహదారులు జలమయమయ్యాయి.

మెదక్ జిల్లా శివ్వంపేట మండలం (బ్లాక్)లో భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు వంతెన కూలిపోవడంతో హవేళిఘన్‌పూర్‌-గంగాపూర్‌ మధ్య రోడ్డు మార్గం తెగిపోయింది. వరదల్లో ఆరు ఆవులు కొట్టుకుపోయాయి. మెదక్‌లోని అన్ని పాఠశాలలకు జిల్లా యంత్రాంగం సెలవు ప్రకటించింది. గ‌డిచిన 24 గంటల్లో మెదక్ జిల్లా పాతూరులో అత్యధికంగా 26.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జనగాంలోని దేవరుప్పులలో 25.5 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా రాజపల్లిలో 24 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మహబూబాబాద్‌లోని దంతేపల్లిలో 22.2, మెదక్‌లో 21.5, సంగారెడ్డి జిల్లా జిన్నారంలో 21.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజాంపేటలోని భండారి లేఅవుట్‌లో వర్షపు నీరు ఇళ్లలోకి చేరింది. పలు అంతస్తుల భవనాల సెల్లార్లు వర్షపు నీటితో నిండిపోయాయి.

హఫీజ్‌పేటలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కాగా జీడిమెట్ల, గాజులరామారంలో 13.9, బాలానగర్‌లో 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 10 రోజుల క్రితం కొన్ని జిల్లాల్లో విధ్వంసం సృష్టించిన గోదావరి నది వరదల నుండి కోలుకోకముందే తాజాగా భారీ వర్షాలు రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాయి. పలు రిజర్వాయర్లకు భారీగా ఇన్ ఫ్లో వచ్చి చేరింది. నీటిపారుదల శాఖ అధికారులు గేట్లను తెరిచి వరద నీటిని దిగువకు వదిలారు.