Site icon HashtagU Telugu

TRS Vs BJP : సెప్టెంబ‌ర్ 17 పొలిటిక‌ల్ ఫైట్ , `షా`పై పోస్ట‌ర్లు!

Trs Posters

Trs Posters

వ‌జ్రోత్స‌వాలు వ‌ర్సెస్ విమోచ‌నోత్సవం తెలంగాణ అంతా క‌నిపిస్తోంది. కేంద్ర‌, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, టీఆర్ఎస్ ఢీ అంటే ఢీ అంటున్నాయి. రాబోయే ఎన్నిక‌ల్లో రాజ్యాధికారం కోసం దూకుడు పెంచాయి. విప‌క్ష పార్టీల‌ను ద‌రిదాపుల్లో లేకుండా వ్యూహ‌త్మ‌కంగా ప్ర‌జ‌ల మైండ్ ను సెట్ గులాబీ, క‌మ‌ల‌ద‌ళాలు సెట్ చేస్తున్నాయి. ఆ క్ర‌మంలో తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం కోసం హైద‌రాబాద్ వ‌స్తోన్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు వ్య‌తిరేకంగా పోస్ట‌ర్లు వెల‌వ‌డం మ‌రింత ఉద్రిక్త‌త‌ను రేపుతోంది.

రెండు రోజుల పాటు అమిత్ షా హైదరాబాద్ లో పర్యటించనున్నారు. శుక్ర‌వారం హైద‌రాబాదుకు చేరుకుని శ‌నివారం (సెప్టెంబ‌ర్ 17న) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జ‌రిగే తెలంగాణ విమోచనదినోత్స‌వ స‌భ‌లో పాల్గొంటారు. పరేడ్ గ్రౌండ్ లో ఆయన జాతీయ జెండాను ఎగురవేస్తారు. ఆయ‌న షెడ్యూల్ ను తెలుసుకున్న కొంద‌రు కేంద్రం, మోడీకి వ్య‌తిరేకంగా అర్ధరాత్రి పోస్టర్లను అతికించారు. కంటోన్మెంట్ యువత పేరుతో ఈ పోస్టర్లు వెలిశాయి. తెలంగాణ అభివృద్ధి, ఆత్మగౌరవానికి సంబంధించి 20 ప్రశ్నలను పోస్ట‌ర్ల‌లో ఎక్కు పెట్టారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని అమిత్ షా చెప్పుల దగ్గర తాకట్టు పెట్టింది ఎవరని ప్ర‌శ్నిస్తూ పోస్ట‌ర్లు అతికించారు. గ‌తంలోనూ మోడీ ఐఎస్ బీ స్నాత‌కోత్స‌వాలకు వ‌చ్చిన సంద‌ర్భంగా వ్య‌తిరేక హోర్డింగ్ లు పెట్టారు. ఇటీవ‌ల సికింద్రాబాద్ లో జ‌రిగిన బీజేపీ జాతీయ స‌మావేశాల‌కు హాజ‌రైన‌ప్పుడు కూడా మోడీకి వ్య‌తిరేకంగా హైద‌రాబాద్ అంత‌టా పోస్ట‌ర్లు అతికించారు. అదే పంథాలో మ‌ళ్లీ ఇప్పుడు అమిత్ షా కు వ్య‌తిరేకంగా పోస్ట‌ర్ల‌ను పెట్టారు.

భారత యూనియన్‌లో తెలంగాణ కలిసి 74 ఏళ్లు పూర్త‌యింది. ఆ సందర్భంగా వజ్రోత్సవం పెద్ద ఎత్తున నిర్వ‌హించ‌డానికి టీఆర్ఎస్ సిద్ధం అయింది. తెలంగాణకు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కాలేదు. 74 ఏళ్లే అయిన‌ప్ప‌టికీ బీజేపీ, టీఆర్ఎస్ దేని లాభం అది చూసుకుంటోంది. ప్ర‌ధాని మోడీ పిలుపు మేర‌కు స్వాతంత్ర్య భారతావనిలో 75 ఏళ్ళకే వజ్రోత్సవాలు జ‌రుపుకున్నాం. అలాగే, వ‌జ్రోత్స‌వాలు జరుపుకోవ‌డానికి తెలంగాణను సిద్ధం చేయ‌డం రాజ‌కీయ కోణం అంద‌రికీ తెలిసిందే. సెప్టెంబరు 17 వస్తుందంటే చాలు, బీజేపీ విమోచన, కాంగ్రెస్ టీడీపీ ఇత‌రులు విలీనం, ఎంఐఎం విద్రోహం, కామ్రేడ్లు విముక్తి వంటి పదాల‌ను వినిపిస్తుండ‌డం చూస్తున్నాం.

నిజాం పాలన నుంచి హైదరాబాద్ సంస్థానం విముక్తి పొంది, భారత యూనియన్‌లో కలిసిన రోజును ‘సెలబ్రేట్ చేసుకుంటే తప్పేమిటి’ అనే వాదన ప్రతిసారీ బలంగా వినిపిస్తుంది. కానీ ముస్లిం ఓటు, స‌హ‌జ మిత్రుని(ఎంఐఎం) ప్ర‌స‌న్నం కోసం కేసీఆర్ అంగీక‌రించ‌రు. వాస్తవానికి ఉమ్మడి ప్రభుత్వాల్ని విమోచనదినాన్ని నిర్వ‌హించలేదు. దాన్ని ఒక అంశంగా తీసుకుని ఉద్య‌మ స‌మ‌యంలో రెచ్చగొట్టారు. అధికారంలోకి వ‌స్తే అధికారికంగా విమోచ‌న దినోత్స‌వం జ‌రుపుకుందామ‌ని తెలంగాణ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ ప్రామిస్ చేశారు. కానీ, ఫ‌క్తు రాజ‌కీయ పార్టీగా మారిన టీఆర్ఎస్ ఇప్పుడు ఉద్య‌మ హామీల‌ను గాలికొదిలేసింది.

ప్రతిసారీ సెప్టెంబరు 17 అనగానే బీజేపీకి పూన‌కం వ‌స్తోంది. ‘విమోచన దినం జరపాల్సిందే’ అని గొంతెత్తుతుంది. ఈసారి కేసీయార్‌ను ఇరుకునపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పెద్ద మీటింగ్ పెట్ట‌డం ద్వారా విమోచ‌న దినాన్ని జ‌రుపుకోవాల‌ని మహారాష్ట్ర, కర్నాటక సీఎంను ఆహ్వానించారు. మహారాష్ట్రలో ఎలాగూ బీజేపీ అనుకూల ఏకనాథ్ షిండే సీఎం, కర్నాటకలో సొంత పార్టీ బొమ్మై సీఎంగా ఉన్నారు. వాళ్లు హాజరు కానున్నారు. తద్వారా కొంత మైలేజీ తీసుకుందామని, కేసీయార్‌ను గోకుదామని ఆలోచన. ప్ర‌తిగా కేసీఆర్‌ బీజేపీకి ఏమాత్రం మైలేజీ వచ్చే చాన్ష్ లేకుండా కౌంటర్ ఆలోచించాడు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల పేరిట రెండు వారాలపాటు రాష్ట్రమంతా ఆగస్టు 8 నుంచి ప్రత్యేక కార్యక్రమాల్ని నిర్వహించిన విష‌యం విదిత‌మే. ప్రతి ఇంటికీ జెండా పంపిణీ, ఒకరోజున ఒకే సమయంలో జాతీయ గీతాలాపన వంటివి జరిగాయి. అలా మొత్తానికి ఆజాదీకా అమృత మహోత్సవ్ ద్వారా బీజేపీ ఏ మైలేజీ తీసుకోకుండా చూశారు. నిజానికి ‘హర్ ఘర్ తిరంగా’ అనేది అమృత మహోత్సవ్‌లో భాగమే. ఇప్పుడు విమోచన దినంపైనా కూడా అదే పంథాలో కేసీఆర్ కౌంట‌ర్ ప్రోగ్రామ్ డిజైన్ చేశారు.

తెలంగాణ వజ్రోత్సవాల ఆలోచనను తెరపైకి తీసుకొచ్చారు. కాకపోతే విమోచనం లాంటి పదాలు వాడరు, తెలంగాణ స్వరాష్ట్రం, స్వపరిపాలన, తెలంగాణ పోరాటం, చారిత్రిక ఉద్యమం వంటి పదాలతో కథ నడిపించేలా ప్లాన్ చేశారు. బీజేపీకి ఏమాత్రం మైలేజి రాకుండా కౌంటర్ స్ట్రాటజీ వేశారు. సెప్టెంబ‌ర్ 17వ తేదీన హైద‌రాబాద్ న‌గ‌ర‌మంత‌టా కేసీఆర్ చేసిన అభివృద్ధి హోర్డింగ్ ల‌కు పెట్టుకోవ‌డానికి ముందుగానే బుక్ చేశారు. బీజేపీ వాళ్లు పోస్ట‌ర్లు పెట్టుకోవ‌డానికి కూడా జాగా లేకుండా ముంద‌స్తుగా కేసీఆర్ పార్టీ ప్లాన్ చేసింది. ఎటుచూసినా కేసీఆర్‌, రాష్ట్ర అభివృద్ధి చిట్టా మాత్ర‌మే ఆరోజున క‌నిపించ‌నుంది. మొత్తం మీద బీజేపీ, టీఆర్ఎస్ న‌డుమ సెప్టెంబ‌ర్ 17వ తేదీ `పొలిటిక‌ల్ డే` గా మారింద‌న్న‌మాట‌.