Site icon HashtagU Telugu

Telangana : తెలంగాణ‌లో విషాదం.. గాలి ప‌టాలు ఎగుర‌వేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఐదుగురు యువ‌కులు

Deaths

Deaths

సంక్రాంతి పండుగ ప‌లు కుటుంబాల్లో విషాదం నింపింది. గత రెండు రోజులుగా గాలిపటాలు ఎగరేసిన ఘటనల్లో తెలంగాణ వ్యాప్తంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు యువకులు విద్యుదాఘాతంతో, పైకప్పుపై నుండి పడి ప్రాణాలు కోల్పోగా, మ‌రో యువ‌కుడు మంజా త‌గిలి మ‌ర‌ణించాడు. వీటిలో నాలుగు మరణాలు హైదరాబాద్‌లో నమోదు కాగా, పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లాలో ఒక యువకుడు మరణించాడు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్‌లోని తన అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్ టెర్రస్ నుండి పడి 20 ఏళ్ల యువకుడు మృతి చెందాడు. మృతుడు అల్వాల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఎస్ఐ రాజ‌శేఖ‌ర్ కుమారుడు ఆకాష్‌గా గుర్తించారు. ఆకాష్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకాశ్ గాలిపటం ఎగురవేస్తూ ఐదంతస్తుల అపార్ట్ మెంట్ టెర్రస్ పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు.సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని రెండంతస్తుల ఇంటి టెర్రస్‌పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో 30 ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మృతి చెందిన వ్య‌క్తి సుబ్రహ్మణ్యం గా పోలీసులు గుర్తించారు. గాలిపటం ఎగురవేస్తుండగా హైటెన్షన్ వైరు తగిలి భవనంపై నుంచి పడిపోయాడు. అతడిని కాపాడే క్రమంలో భార్య చాముండేశ్వరి దేవికి గాయాలయ్యాయి.ఈ ఘ‌ట‌న‌లో దంపతులను సంగారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యంలో సుబ్రహ్మణ్యం మృతి చెందాడు. అతని భార్య చికిత్స పొందుతోంది. సంక్రాంతిని జరుపుకోవడానికి సుబ్రహ్మణ్యం తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఇస్నాపూర్ నుంచి అత్తమామల ఇంటికి వ‌చ్చి దుర‌దృష్ట‌వ‌శాత్తు ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు.

We’re now on WhatsApp. Click to Join.

గతంలో హైదరాబాద్‌లో జరిగిన రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. శనివారం అత్తాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ భవనం టెర్రస్‌పై గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుదాఘాతంతో తనిష్క్ (11) మృతి చెందాడు. ఆ బాలుడు తన స్నేహితులతో కలిసి ఓ అపార్ట్‌మెంట్ భవనం పైకప్పుపై గాలిపటాలు ఎగురవేస్తున్నాడు. అదే స‌మ‌యంలో హైటెన్షన్ విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడ‌ని పోలీసులు తెలిపారు. రెండో ఘటనలో నాగోల్‌లో తన స్నేహితులతో కలిసి ఇంటి పైకప్పుపై గాలిపటం ఎగురవేస్తూ ఓ బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.నాగోల్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న కె.శివ ప్రసన్న (13) అనే విద్యార్థి గాలిపటం ఎగురవేస్తూ నాలుగు అంతస్తుల భవనం టెర్రస్‌పై నుంచి పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. నాగర్‌కర్నూల్‌లో గాలిపటం ఎగురవేస్తుండగా విద్యుత్ తీగ తగిలి ఓ బాలుడు కూడా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు.

Also Read:  Cock Fight : గోదావ‌రి జిల్లాల్లో రెండోరోజు జోరుగా సాగిన కోడిపందాలు.. చేతులు మారిన కోట్ల రూపాయ‌లు

లోహపు పూతతో కూడిన ‘మాంజా’ దారం విద్యుత్ ప్ర‌స‌రించే అవ‌కాశం ఉంద‌ని విద్యుత్ అధికారులు తెలాపారు. విద్యుత్ స్తంభాల దగ్గర గాలిపటాలు ఎగురవేయవద్దని విద్యుత్ అధికారులు ప్రజలకు సూచించారు.. చైనా మాంజా హైదరాబాద్‌లో ఓ సైనికుడి ప్రాణాలను బలిగొంది. కాగితాల కోటేశ్వర్ రెడ్డి (30) స్కూటీపై వెళుతుండగా చైనీస్ మాంజా అతని గొంతుకు త‌గిలి కోసుకుపోయింది. దీంతో అత‌ను మ‌ర‌ణించాడు. ఈ ఘటన శనివారం సాయంత్రం లంగర్ హౌజ్‌లోని ఇంద్రకరణ్‌రెడ్డి ఫ్లైఓవర్‌పై చోటుచేసుకుంది. తీవ్ర రక్తస్రావమైన ఆర్మీ అధికారిని ఆసుపత్రిలో చేర్పించ‌గా.. అక్కడ అతను మరణించాడు. కోటేశ్వర్ రెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం జిల్లా పెద్ద వాల్తేర్ అని పోలీసులు తెలిపారు.