Fish Medicine: చేప ప్రసాదం పంపిణీ షురూ.. భారీగా తరలివచ్చిన జనం!

మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు అందజేస్తున్న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది.

  • Written By:
  • Updated On - June 9, 2023 / 01:19 PM IST

మృగశిర కార్తెను పురస్కరించుకొని ఆస్తమా బాధితులకు బత్తిని కుటుంబీకులు తరతరాలుగా అందజేస్తున్న చేప ప్రసాదం పంపిణీ ప్రారంభమైంది. సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించే శుభతిథి ప్రకారం శుక్రవారం ఉదయం 8 గంటలకు బత్తిని హరినాథ్‌గౌడ్‌ నేతృత్వంలో హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌ వేదికగా పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమం 24 గంటలపాటు నిర్విరామంగా కొనసాగనుంది.  చేప ప్రసాదం పంపిణీని మంత్రి తలసాని ప్రారంభించారు.

చేపమందు కోసం వచ్చే వారి కోసం ప్రవేశ ద్వారం వద్ద 18 క్యూలైన్లను ఏర్పాటుచేశారు. వాటిని ప్రసాదం అందించే ప్రదేశానికి వెళ్లే సరికి 32 కౌంటర్లుగా విస్తరించేందుకు ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్, యూపీ, ఒడిశా, చత్తీస్‌ఘడ్ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో జనం మందు కోసం తరలి వచ్చారు. ఎంతమంది వచ్చినా మందు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు బత్తిని సాయినాథ్ గౌడ్ తెలిపారు.

చేపమందు ప్రసాదం కోసం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు వెళ్లడానికి నగరంలోని అన్ని ప్రాంతాల నుంచి 130 బస్సుల్ని ఏర్పాటు చేశారు. సికింద్రాబాద్, కాచిగూడ రైల్వే స్టేసన్లతో పాటు ఎంజీబీఎస్‌, జేబీఎస్, దిల్‌సుఖ్‌నగర్‌ తదితర ప్రాంతాల నుంచి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచనున్నారు. హైదరాబాద్ మెట్రో రైళ్ల సంఖ్యను కూడా పెంచనున్నట్లు మెట్రో వర్గాలు తెలిపాయి.

Also Read: Bollywood Singles: పెళ్లి వద్దు.. సహజీవనమే ‘ముద్దు’ అంటున్న బాలీవుడ్ స్టార్స్!