Site icon HashtagU Telugu

Suicide : బాస‌ర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌

Deaths

Deaths

బాస‌ర ట్రిపుల్ ఐటీలో బుధ‌వారం రాత్రి ఓ విద్యార్థిని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఓ భవనంలోని నాలుగో అంతస్థుపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటనలో విద్యార్థిని మృతి చెందింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌కు చెందిన బూర లిఖిత (19) అనే విద్యార్థిని మొదటి సంవత్సరం చ‌దువుతుంది. ఆమె తెల్లవారుజామున 2 గంటల సమయంలో భవనంపై నుంచి పడిపోయింది. ఆమె అపస్మారక స్థితిలో ఉండటాన్ని భద్రతా సిబ్బంది గమనించారు. వెంటనే ఆమెను భైంసాలోని ఆసుపత్రికి తరలించారు.
పరిస్థితి విషమించడంతో ఆమెను నిర్మల్ పట్టణంలోని ఆస్పత్రికి తరలించారు. ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై యూనివర్సిటీ అధికారులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. కాగా యూట్యూబ్‌లో వీడియోలు చూస్తుండగా ప్రమాదవశాత్తు లిఖిత కిందపడిపోయిందని వైస్‌ఛాన్సలర్‌ ప్రొఫెసర్‌ వి వెంకటరమణ విలేకరులకు తెలిపారు. ఆమెకు తలకు, వెన్నుపూస‌కు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు. ఆమె ఆత్మహత్యకు గల కారణాలను ఇన్‌స్టిట్యూట్ అధికారులు వెల్లడించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ధర్నాకు దిగారు.