Site icon HashtagU Telugu

Telangana BJP: తొలి జాబితాకు బీజేపీ సిద్ధం, 40 మంది పేర్లు ఖరారు!

Bjp Graph Down

Bjp Graph Down

Telangana BJP: తెలంగాణ రాష్ట్ర బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 15 నాటికి 30 నుంచి 40 మంది పేర్లతో విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి రాష్ట్రంలో పర్యటించి బహిరంగ సభల్లో పాల్గొన్న కొద్ది రోజులకే బీజేపీ అభ్యర్థుల తొలి జాబితాను ఖరారు చేసింది. తొలి జాబితాలో మెజారిటీ సీనియర్‌ బీజేపీ నేతలు, ప్రజాప్రతినిధులు చోటు దక్కించుకునే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గెలిచే అభ్యర్థుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ జరిగింది. బీజేపీ మేనిఫెస్టో కమిటీ సభ్యులు నాంపల్లి బీజేపీ కార్యాలయంలో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఎంపీ బండి సంజయ్‌కుమార్‌ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేనిఫెస్టోలో ఉండే అవకాశం ఉందని సమాచారం.

తెలంగాణలో త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బీజేపీ సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మహబూబ్ నగర్, నిజామాబాద్ జిల్లాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ నెల 15న బీజేపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి తొలిజాబితా ప్రకటన చేశారు.

ఇటీవల దిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసిన కిషన్ రెడ్డి క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రచార సభలు, కేంద్రమంత్రుల పర్యటనలపై చర్చించారు. వచ్చే రెండు నెలల్లో అనేక మంది కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు తెలంగాణలో పర్యటిస్తారని కిషన్ రెడ్డి చెప్పారు. నవంబర్‌ మొదటి వారంలోపు తెలంగాణలో 30 సభలు నిర్వహించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నామని కిషన్‌రెడ్డి అన్నారు.