First GBS Death : గిలైన్ బారె సిండ్రోమ్ (GBS) కలకలం రేపుతోంది. ఈ అంతుచిక్కని వ్యాధి బారినపడి తెలంగాణలో తొలిసారిగా ఒకరు చనిపోయారు. సిద్దిపేట జిల్లా సీతారాంపల్లికి చెందిన ఓ మహిళ హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ శనివారం రాత్రి చనిపోయింది. ఆమె నెలరోజుల క్రితం జీబీఎస్ వ్యాధి బారినపడింది. తొలుత ఆమెకు సిద్దిపేటలోనే వైద్యం చేయించారు. తదుపరిగా హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. అక్కడి నుంచి కిమ్స్ ఆస్పత్రిలో జాయిన్ చేశారు. సదరు మహిళ చికిత్స కోసం లక్షలాది రూపాయలు ఖర్చు చేశారు. అయినా జీబీఎస్(First GBS Death) వ్యాధిబారి నుంచి ఆమెను వైద్యులు కాపాడలేకపోయారు. దీంతో తెలంగాణ రాష్ట్రంలో తొలి జీబీఎస్ మరణం నమోదైంది. జీబీఎస్ వ్యాధి ఇప్పటికే పొరుగున ఉన్న మహారాష్ట్రలో కలకలం రేపుతోంది. అక్కడ ఇప్పటివరకు దాదాపు 200 కేసులు నమోదయ్యాయి. దాదాపు ఆరుగురు చనిపోయారు.
Also Read :TS RTC Buses : ఆర్టీసీ బస్సుల 25,609 ట్రాఫిక్ ఉల్లంఘనలు.. రూ.1.84 కోట్ల ఫైన్‌లు
ఏమిటీ గిలైన్ బారె సిండ్రోమ్ ?
- గిలైన్ బారె సిండ్రోమ్ (జీబీఎస్) వ్యాధి కొత్తదేమీ కాదు.
- సాధారణంగా లక్ష మందిలో ఒకరో ఇద్దరికో ఈ వ్యాధి వస్తుంటుంది.
- ఈ వ్యాధి వల్ల నరాలు బలహీనపడి పక్షవాతం వస్తుంది. కండరాలు చచ్చుబడతాయి.
- తొలుత ఇతరత్రా ఇన్ఫెక్షన్లు వస్తాయి. ఆ తర్వాతే ఈ వ్యాధి మొదలవుతుంది.
ఎలా వస్తుంది ?
- మన శరీరంలో సహజ సిద్ధమైన రోగ నిరోధక వ్యవస్థ ఉంటుంది. మన శరీరంలోకి ఏవైనా బ్యాక్టీరియాలు, వైరస్‌లు వస్తే రోగ నిరోధక వ్యవస్థ నుంచి యాంటీబాడీలు రిలీజ్ అవుతాయి. అవి బ్యాక్టీరియాలు, వైరస్‌లను అంతం చేస్తాయి. తద్వారా మనకు సోకిన ఇన్ఫెక్షన్లు నయం అవుతాయి.
- పొరపాట్లు ఎవరైనా చేసే అవకాశం ఉంటుంది. మన రోగ నిరోధక వ్యవస్థలోని యాంటీ బాడీలు కూడా పొరపాట్లు చేస్తాయి. ఈ యాంటీబాడీలు పొరపాటున తమ కణజాలాన్నే శత్రువుగా భావించి, దానిపై దాడి చేసుకుంటాయి. దీనివల్లే సొరియాసిస్, ల్యూపస్ వంటి స్వీయరోగనిరోధక (ఆటోఇమ్యూన్) జబ్బులు వస్తుంటాయి. గిలైన్ బారె సిండ్రోమ్(జీబీఎస్) కూడా ఇలాంటి వ్యాధే.
- మన రోగ నిరోధక వ్యవస్థలోని యాంటీబాడీలు పొరపాటున.. వెన్నుపాము నుంచి కాళ్లు, చేతులు వంటి భాగాలకు వెళ్లే నాడులపై ఉండే పొర(మాలిక్యులర్ మిమిక్రీ మెకానిజం)ను దెబ్బతీస్తాయి. ఇక్కడే మనకు సమస్య మొదలవుతుంది.
- జీబీఎస్ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సోకదు. అయినా కలుషిత నీరు, ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి.