News Reader Santhi Swaroop : దూరదర్శన్ శాంతిస్వరూప్ ఇక లేరు

నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..అంటూ ఆరోజుల్లో దూరదర్శన్ ద్వారా అందర్నీ శాంతిస్వరూప్ పలకరించేవారు

  • Written By:
  • Publish Date - April 5, 2024 / 11:26 AM IST

తెలుగులో దూరదర్శన్ పేరు వినగానే చాలామందికి గుర్తుకొచ్చే పేరు శాంతిస్వరూప్ (Santhi Swaroop)..తెలుగులో మొట్టమొదట న్యూస్ రీడ‌ర్ (News Reader) గా ఆయనకు ఎంతో గుర్తింపు ఉంది. అలాంటి ఆయన ఈరోజు అందర్నీవిడిచి వెళ్లారు. శుక్రవారం ఉదయం గుండె పోటుతో ఆయన కన్నుమూశారు. గత కొద్దీ రోజులుగా అనారోగ్యం తో మలక్ పేట యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.

నమస్కారం.. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు..అంటూ ఆరోజుల్లో దూరదర్శన్ ద్వారా అందర్నీ శాంతిస్వరూప్ పలకరించేవారు. బాలల దినోత్సవం సందర్భంగా లాల్ బహదూర్ స్టేడియంలో బాలల దినోత్సవాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఎన్ టీ రామారావు (NTR) ప్రారంభించారు. తెలుగు టీవీ చరిత్రలో తొలిసారి ప్రసారమైన వార్తల్లోని ముఖ్యాంశాలు ఇవి. దూరదర్శన్ చానల్ లో సాయంత్రం 7 గంటలకు 1983 నవంబర్ 14వ తేదీన ప్రసారమైన ఈ వార్తలు బులిటెన్ ప్రారంభం అయ్యింది. అప్పట్లో ఒక సంచలనం. వాటిని లైవ్ లో చదివి వినిపించింది, ఇప్పుడు చాలా మంది న్యూస్ రీడర్లు గురువుగా భావించే శాంతి స్వరూప్. జీవన, సాహిత్య సారాన్ని అవపోసనపట్టి యాంకర్ బాధ్యతను సమర్ధంగా నిర్వహించారు. 2011 లో పదవీ విరమణ చేసే వరకూ ఆయన వార్తలు చదవడం విశేషం.

We’re now on WhatsApp. Click to Join.

శాంతి స్వరూప్‌ (Santhi Swaroop) పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే. ఎలాంటి కార్యక్రమమైనా ఏకధాటిగా నడపగల దిట్ట. రామంతాపూర్‌లోని టీవీ కాలనీలో ఆయన నివాసం. 20ఏళ్లకు పైగా తెలుగు వార్తలు చదివిన ఏకైక వ్యక్తిగా శాంతి స్వరూప్ ఘనత వహించారు. వార్తలు చదవడంలో ఆయనది విలక్షణమైన శైలి. ఎలాంటి వార్త అయినా ఒకేలా చదవడం ఆయన ప్రత్యేకత. ఇక ఈయన లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును కూడాఅందుకున్నారు. శాంతిస్వరూప్ మృతి పట్ల రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. శాంతిస్వరూప్ భార్య రోజారాణి కూడా టీవీ యాంకర్ గా పని చేశారు. కొంత కాలం క్రితమే ఆమె కన్నుమూశారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Read Also : Laid Off 600 Workers: 600 మంది ఉద్యోగుల‌ను తొల‌గించిన ప్ర‌ముఖ సంస్థ‌.. కార‌ణం కూడా చెప్పేసింది..!