Bibinagar : డెమో ప్యాసింజర్ రైలు మిర్యాలగూడ నుంచి కాచిగూడ వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా నాగారెడ్డిపల్లి గ్రామాన్ని దాటుతున్న సమయంలో ఈ రైలు కింది భాగంలో మంటలు చెలరేగాయి. వీటిని గుర్తించిన వెంటనే రైల్వే సిబ్బందికి ప్రయాణికులు సమాచారాన్ని అందజేశారు. దీంతో బీబీనగర్ రైల్వే స్టేషనులో రైలును ఆపి, అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ సహాయంతో మంటలను ఆర్పారు. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదని రైల్వే అధికారులు చెప్పారు. ఈనేపథ్యంలో రైలు దాదాపు గంటన్నర పాటు బీబీనగర్‌లోనే(Bibinagar) నిలిచిపోయింది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులుపడుతున్నారు.
Also Read :Saraswati River Mystery : సరస్వతీ నది ఎలా అదృశ్యమైంది.. రీసెర్చ్‌లో ఏం తేలింది ?
సాంకేతిక నిర్వహణలో లోపాల వల్లే.. ?
- 2024 సంవత్సరం జూన్ 20న సికింద్రాబాద్ మెట్టుగూడ వద్ద ఆగి ఉన్న రైలులో మంటలు చెలరేగాయి. రెండు ఏసీ బోగీల్లో మంటలు వ్యాపించాయి. పరిసరాలను పొగ కమ్మేసింది. ఆ ఘటన జరిగిన సమయంలోనూ వెంటనే మంటలను ఆర్పారు.
- 2025 సంవత్సరం ఏప్రిల్ 25న హౌరా – చెన్నై మధ్య నడిచే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు కార్గో బోగి చక్రాల నుంచి మంటలు చెలరేగాయి. లోకో పైలట్ వెంటనే అప్రమత్తమై.. ఉంగుటూరు మండలం తేలప్రోలు స్టేషన్ సమీపంలో రైలును ఆపాడు. అనంతరం మంటలు ఆర్పారు.
- ఈవిధంగా రైళ్లలో మంటలు చెలరేగడానికి సాంకేతికపరమైన నిర్వహణలో చోటుచేసుకునే లోపాలే కారణమని పరిశీలకులు అంటున్నారు. రైలు ప్రయాణికుల భద్రత కోసం ఇలాంటి అంశాల్లో రైల్వే ఉన్నతాధికారులు కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.
- సాంకేతికపరమైన నిర్వహణను చూసే విభాగాలు, కాంట్రాక్టు సంస్థలకు కఠినమైన నిబంధనలు పెట్టాల్సిన అవసరం ఉంది.
- ఇది రైలు ప్రయాణికుల ప్రాణాలకు సంబంధించిన అంశం. కాబట్టి మంటలు చెలరేగడం వంటివి జరిగినప్పుడు సదరు సాంకేతిక అంశాలను పర్యవేక్షించే అధికారులు, కాంట్రాక్టు సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలి. అలా చేస్తేనే మరోసారి రైళ్లలో మంటలు రేగడం వంటి ఘటనలు రిపీట్ కాకుండా ఉంటాయి.