హైదరాబాద్ కేపీహెచ్‌బీ మెట్రో రైలు స్టేషన్‌కు ఆనుకుని ఉన్న ఓ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శుక్రవారం అర్థరాత్రి ఈ అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని ఫర్నీచర్ దుకాణం, గిఫ్ట్ షాపుతో పాటు ఇతర దుకాణాలు దగ్ధమైనట్లు పోలీసులు తెలిపారు. షార్ట్ సర్య్కూట్ వల్ల ఆ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. కూకట్‌పల్లి, జీడిమెట్ల, సనత్‌నగర్, మాదాపూర్ నుంచి అగ్నిమాపక యంత్రాలతో మంటలు అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఫర్నీచర్ దుకాణంలో మండే పదార్థాలు ఉండడంతో మంటలను అదుపు చేయలేకపోయారు. ముందు జాగ్రత్త చర్యగా భవనం దగ్గర 100 మీటర్ల వ్యాసార్థంలో అన్ని దుకాణాలను అధికారులు మూసివేశారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండడంతో మెట్రో రైలు స్టేషన్‌లో వేడి నెలకొంది. 30 నిమిషాల వరకు మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడింది. అగ్ని ప్రమాదం కారణంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది. మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించకుండా అదుపు చేశామని, భవనంలో మంటలను అదుపు చేసే పనిలో ఉన్నామని ఫైర్ అధికారి గిరిధర్‌రెడ్డి తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.