Fees Reimbursement : ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను త్వరలోనే చెల్లిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. బకాయిలపై ఇంజినీరింగ్, టెక్నికల్ కాలేజీల యజమానులు, విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తున్నామని, అసెంబ్లీ సమావేశాల తర్వాత దశల వారీగా చెల్లిస్తామన్నారు. ఉన్నత విద్యా సంస్థలు మనుగడ సాగించాలంటే బకాయిలు ఉండకూడదని మంత్రి పేర్కొన్నారు. ఆర్థిక సమస్యలను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వెళుతున్నామని అన్నారు.
కెప్టెన్ లేని నావలా బీఆర్‌ఎస్ పార్టీ తయారైందని, నాయకుడు లేకుంటే పార్టీ ఎలా ఉంటుందో సభలో స్పష్టంగా తెలుస్తోందని అసెంబ్లీ లాబీల్లో మీడియాతో చిట్‌చాట్‌గా మాట్లాడుతూ అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు సభను తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. భూమిలేని కూలీలకు డబ్బులు ఇస్తామంటే బీఆర్‌ఎస్ వద్దంటోందని, రైతు కూలీలకు మేలు జరగడం వారికి ఇష్టం లేదని అన్నారు.
కాగా, ఏఐసీసీ పిలుపు మేరకు టీపీసీసీ బుధవారం చలో రాజ్‌భవన్ కార్యక్రమాన్ని చేపట్టనుంది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం నుంచి రాజ్‌భవన్ వరకూ జరిగే నిరసన ప్రదర్శనలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, మంత్రులు, పార్టీ ముఖ్యనేతలు పాల్గొననున్నారు. గౌతమ్ అదానీ అమెరికాలో ఆర్థిక అవకతవకలకు పాల్పడి దేశం పరువు తీసినందుకు గానూ నిరసనగా ఏఐసీసీ పిలుపునిచ్చింది.