Rice Scam : తెలంగాణ‌లో బియ్యం కుంభ‌కోణం, 4ల‌క్ష‌ల బ‌స్తాలు హాంఫ‌ట్‌!

తెలంగాణ రాష్ట్రంలో బియ్యం కుంభ‌కోణం సంచ‌న‌లంగా మారింది. సుమారు 4ల‌క్ష‌ల బియ్యం బ‌స్తాలు మాయ‌మైన‌ట్టు ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా అధికారులు తేల్చారు. మిల్లింగ్‌, స్టోరేజి ప్ర‌క్రియ‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన రైస్ మిల్ల‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా కేసీఆర్ స‌ర్కార్ చేతులు ఎత్తేసింది.

  • Written By:
  • Updated On - July 21, 2022 / 04:05 PM IST

తెలంగాణ రాష్ట్రంలో బియ్యం కుంభ‌కోణం సంచ‌న‌లంగా మారింది. సుమారు 4ల‌క్ష‌ల బియ్యం బ‌స్తాలు మాయ‌మైన‌ట్టు ఫుడ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా అధికారులు తేల్చారు. మిల్లింగ్‌, స్టోరేజి ప్ర‌క్రియ‌లో అక్ర‌మాల‌కు పాల్ప‌డిన రైస్ మిల్ల‌ర్ల‌పై చ‌ర్య‌లు తీసుకోకుండా కేసీఆర్ స‌ర్కార్ చేతులు ఎత్తేసింది. ఆ కార‌ణంగా బియ్యం కొనుగోళ్ల‌ను నిలిపివేసిన కేంద్రం తిరిగి ముడి రైస్ ను తీసుకోవ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. రాష్ట్రం నుండి బియ్యం సేకరణ చేయాల‌ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (FCI)కి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ మేర‌కు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్‌రెడ్డి, ఆహార, ప్రజాపంపిణీ వ్యవస్థ (PDS) మంత్రి పీయూష్‌ గోయల్ ప్ర‌క‌టించారు. రేషన్ కార్డుదారులందరికీ పంపిణీ చేసేందుకు కేంద్రం రూ.5కు కిలో బియ్యాన్ని ఉచిత సరఫరా చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం ద్వారా పేద వర్గాలకు అండగా నిలిచింది.

జూన్ మొదటి వారంలో బియ్యం కొనుగోళ్లు నిలిపివేయడంతో రాష్ట్రవ్యాప్తంగా రైస్ మిల్లుల్లో సుమారు 94 లక్షల టన్నుల వరి ధాన్యం నిలిచిపోయింది. దీనికి తోడు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బియ్యం నిల్వలు త‌డిసిపోయాయి. ప్రధానమంత్రి పథకం కింద జూన్‌ నుంచి బియ్యం పంపిణీని ప్రారంభించినట్లు తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి తెలియజేసింది. అలాగే ఏప్రిల్‌, మే నెలల బ్యాక్‌లాగ్‌లను జూలై, ఆగస్టులో పంపిణీ చేస్తామని హామీ ఇచ్చింది. అక్రమాలకు పాల్పడుతున్న రైస్‌ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామని చెప్పింది. అవేమీ చేయ‌క‌పోయిన‌ప్ప‌టికీ రైతులు మరియు పేదల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, తెలంగాణ నుంచి బియ్యం సేకరణను తిరిగి ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించిందని గోయల్ వెల్ల‌డించారు.

తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల రైతులకు క‌లుగుతోన్న న‌ష్టంతో పాటు రైస్‌మిల్లర్ల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని బియ్యం సేకరణను పునఃప్రారంభిస్తున్నామ‌ని కేంద్ర ఆహార మంత్రి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులు, పేదల పట్ల అత్యంత నిర్ల‌క్ష్యంగా వ్యవహరిస్తోందని గోయల్ విమర్శించారు. ముఖ్యమంత్రి, ఆయన కేబినెట్ మంత్రులు ప్రధాని, కేంద్ర మంత్రులపై ‘అసభ్య పదజాలం’ ప్రయోగిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాజకీయాలు ఆడడానికే ఎక్కువ ఆసక్తి చూపుతోందని, ఆహార అవసరాల కోసం పీడీఎస్ బియ్యంపై ఆధారపడి బతుకుతున్న రైతులు, పేద వర్గాల గురించి కనీసం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

వరి సేకరణ విషయంలో కేంద్రానికి సహకరించకుండా రాజకీయ మైలేజీని పొందేందుకు తెలంగాణ ప్రభుత్వం ‘రాజకీయం’ చేస్తోందని కేంద్ర మంత్రి జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు.“ఏ కారణం లేకుండానే వారు ప్రధానమంత్రి బియ్యం పథకాన్ని నిలిపివేశారు. అక్రమాలకు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. ఈ అవకతవకలను మేము ఎత్తి చూపినప్పుడు, సిఎం, అతని మంత్రులు తెలంగాణలో ధర్నాలు, నిరసనలు ప్రారంభించారు. ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. ఇదంతా చేయాల్సిన అవసరం ఎక్కడ వచ్చింది? కేవలం ముడి బియ్యం మాత్రమే సరఫరా చేస్తామని ఎఫ్‌సీఐతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కసారిగా తమ స్టాండ్ మార్చుకుని బాయిల్డ్ రైస్ సరఫరా చేయాలని పట్టుబట్టారు. మేము దానిని ప్రశ్నించినప్పుడు, వారు బిజెపి, కేంద్రంపై తప్పుడు కేసులు పెట్టడం ప్రారంభించారు” అని కిషన్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు గోయల్‌ను కలిసి బియ్యం సేకరణను తిరిగి ప్రారంభించి తమను రక్షించాలని అభ్యర్థించారు. కొంతమంది రైస్‌మిల్లర్లు బ్లాక్‌ మార్కెటింగ్‌ చేస్తున్నారని గోయల్‌ ఎత్తిచూపారని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మిల్లర్లు గోయల్‌కు హామీ ఇచ్చారు. భవిష్యత్తులో బ్లాక్‌ మార్కెటింగ్‌కు పాల్పడితే తీవ్ర పరిణామాలుంటాయని గోయల్‌ హెచ్చరించారు. మొత్తం మీద క‌థ బియ్యం క‌థ‌ను సుఖాంతం చేయ‌డానికి కేంద్రం ప్ర‌భుత్వం రంగంలోకి దిగింది. బియ్యం కుంభకోణాన్ని ఎలా బ‌య‌ట‌కు తీసుకొస్తుందో చూడాలి.