Site icon HashtagU Telugu

MP Dharmapuri Arvind : ‘‘ఐ విల్ మిస్ యూ డ్యాడీ’’.. డీఎస్ కుమారుడు ఎంపీ అర్వింద్ ఎమోషనల్ పోస్ట్

Mp Dharmapuri Arvind

MP Dharmapuri Arvind : కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న  కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. రేపు నిజామాబాద్‌లో డీఎస్ అంత్యక్రియలు జరుగనున్నాయి. సాయంత్రం నిజామాబాద్ ప్రగతి నగర్‌లోని ఆయన నివాసానికి డీఎస్ పార్థివదేహాన్ని తీసుకురానున్నారు. డీఎస్ మృతి పట్ల పలువురు నేతలు సంతాపం తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ మృతిపట్ల కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. డీఎస్ సుదీర్ఘ రాజకీయ జీవితంలో ప్రజాసేవకు అంకితమయ్యారని కొనియాడారు. 2004-2009లో అసెంబ్లీలో డీఎస్ తమకు అందించిన ప్రోత్సాహం మరువలేనిదని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.  డి.శ్రీనివాస్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.  బీజేపీ ఎంపీ అరవింద్(MP Dharmapuri Arvind), డీఎస్ ఇతర కుటుంబ సభ్యులకు కిషన్ రెడ్డి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సంతాపం

డీఎస్ మృతిపట్ల సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీతక్క, గుత్తా సుఖేందర్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డీఎస్ అకాల మరణంపై మంత్రి పొన్నం ప్రభాకర్  తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. సుదీర్ఘ కాలం పార్టీలో ఆయనతో  ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ క్లిష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని ఆ దేవుడిని ప్రార్థిస్తానన్నారు. డీఎస్ మృతిపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ సంతాపం తెలిపారు. కాంగ్రెస్‌కు డీఎస్ చేసిన సేవలు మరువలేనివన్నారు.

We’re now on WhatsApp. Click to Join

తండ్రి మృతి పట్ల డీఎస్ కుమారుడు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ పోస్ట్ చేశారు. తన తండ్రి డీఎస్ స్మృతులను ఆయన గుర్తు చేసుకున్నారు. “అన్నా..అంటే నేనున్నా అని.. ఏ ఆపదలో అయినా ఆదుకునే శీనన్న ఇక లేరు. ఐ విల్ మిస్ యూ డ్యాడీ. నా తండ్రి, నా గురువు అన్నీ మా నాన్నే.! ఎదురొడ్డు, పోరాడు, భయపడకు అని నేర్పింది మా నాన్నే.. ప్రజలను ప్రేమించు, ప్రజల కొరకే జీవించు అని చెప్పింది మా నాన్నే. నాన్నా..! నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావు. ఎప్పటికీ నా లోనే ఉంటావు” అని తన పోస్టులో అర్వింద్ రాసుకొచ్చారు.

Also Read :Dharmapuri Srinivas : కాంగ్రెస్ సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత

Also Read :CM Revanth : ఇవాళ వరంగల్‌‌కు సీఎం రేవంత్.. పర్యటన షెడ్యూల్ ఇదీ