Site icon HashtagU Telugu

Harassment : పనిమనిషిపై దారుణం.. లైంగిక దాడికి పాల్పడిన తండ్రి,కొడుకు

banjarahills crime news

banjarahills crime news

Harassment : ప్రముఖ ప్రైవేట్ స్కూల్ మాజీ చైర్మన్, అతని కుమారుడిపై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అత్యాచార యత్న కేసు నమోదైంది. ప్రస్తుతం ఒక హౌసింగ్ సొసైటీకి కార్యదర్శిగా ఉన్న పేరుమోసిన వ్యక్తి, అతని కుమారుడి ఇంట్లో బాధిత యువతి (22) ఈ ఏడాది జూన్ 18వ తేదీన పనిమనిషిగా చేరింది. అయితే.. కొంతకాలంగా తండ్రీ, కొడుకు ఇద్దరూ తనను బెదిరించి, లైంగిక దాడికి పాల్పడటమే కాక.. రోజూ కొడుతున్నారని బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

వారి ఇంట్లో పనిమనిషిగా చేరిన రెండు వారాల తర్వాతి నుంచీ.. ఆమెను వేధించడం మొదలు పెట్టారని, జులై 16న తనపై లైంగిక దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే తనతో పాటు తన తల్లిని కూడా చంపేస్తానని బెదిరించినట్లు వెల్లడించింది. ఇటీవల తన తల్లికి జరిగిందంతా చెప్పుకుని బోరున విలపించగా.. తల్లి సూచన మేరకు అక్టోబర్ 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి ఫిర్యాదు మేరకు తండ్రి, కొడుకుపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధిత యువతిని భరోసా కేంద్రానికి తరలించారు. ఆ తండ్రి కొడుకులు మురళీముకుంద్, ఆకాష్ అని సమాచారం. దర్యాప్తులో నేరం రుజువైతే ఆ ఇద్దరికీ శిక్షపడే అవకాశం ఉంది.