దేశంలో రుతుపవనాల తీరు రైతులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ప్రముఖ వాతావరణ సంస్థ Skymet చేసిన అంచనా ప్రకారం.. దేశంలో రుతుపవన విరామం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఈ ప్రకటన ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో సతమతమవుతున్న రైతుల్లో మరింత కంగారు పుట్టిస్తోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి Skymet అంచనా నిరాశను కలిగిస్తోంది.
Skymet సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం.. “రుతుపవన ద్రోణి తూర్పు భాగం రానున్న రెండు రోజుల్లో ఉత్తరాది వైపునకు వెళ్లనుంది. ఈ పరిణామం వల్ల తమిళనాడు మరియు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాలు మినహా, దక్షిణ భారతదేశంలో వర్షాభావం కొనసాగే అవకాశం ఉందని Skymet స్పష్టం చేసింది. సాధారణంగా రుతుపవన ద్రోణి దక్షిణం వైపు పయనిస్తేనే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
Janahita Padayatra : నేటి నుంచి కాంగ్రెస్ ‘జనహిత’ పాదయాత్ర
అయితే ఈసారి రుతుపవన ద్రోణి దక్షిణం వైపు పయనించకపోవడంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని Skymet వివరించింది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే, ఖరీఫ్ పంటలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. తమ పెట్టుబడులు నిరాశకు గురవుతాయేమోనని భయం వారిని వెంటాడుతోంది. రుతుపవన ద్రోణి తిరిగి దక్షిణాది వైపు వచ్చాకే వర్షాలు కురుస్తాయని Skymet అంచనా వేసింది. రాబోయే రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా మారతాయో, రైతుల కష్టాలు తీరుతాయో లేదో వేచి చూడాలి.